హైదరాబాద్, వెలుగు: టీఎన్జీవో హైదరాబాద్ యూనియన్ ఎన్నికల నిర్వహణకు 13 మందితో అడహాక్ కమిటీని మంగళవారం కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ నియమించారు. సిటీ యూనియన్ టర్మ్ గతేడాది ఆగస్ట్ లోనే ముగియగా, ఈనెల 24న జరిగిన కేంద్ర సంఘం ఈసీ మీటింగ్ లో తీర్మానం, ఎలక్షన్ రూల్ ప్రకారం ఈ కమిటీని నియమించినట్లు పత్రిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు సిటీ యూనియన్ అధ్యక్ష , కార్యదర్శులుగా పనిచేసిన సల్వాధి శ్రీరామ్, శ్రీకాంత్, సిటీ కార్యవర్గానికి ఇకపై సిటీ శాఖతో సంబంధం లేదని నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు సిటీ పరిధిలో ఉండే అన్ని శాఖల హెచ్ వో డీ లకు కేంద్ర సంఘం నేతలు లేఖలు రాశారు. టీఎన్జీవో నగర శాఖ తాత్కాలిక కమిటీ కన్వీనర్ గా పంతులు హరికృష్ణ, కో–కన్వీనర్ జమ్మలమడుగు రమేశ్ సహా 13 మంది సభ్యులతో కమిటీని ప్రకటించారు.
యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సిటీ యూనియన్ సెక్రటరీ శ్రీకాంత్, కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ మెంబర్ షిప్ ను రద్దు చేస్తూ సిటీ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీరామ్ సోమవారం సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. టర్మ్ పూర్తయిన కమిటీ ప్రెసిడెంట్ మెంబర్ షిప్ ఎలా రద్దు చేస్తారని కేంద్ర సంఘం నేతలు దీనిపై ప్రశ్నిస్తున్నారు. దీంతో సిటీ యూనియన్ తో పాటు సంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల టర్మ్ కూడా పూర్తయిందని, వచ్చే 6 నెలల్లో ఎన్నికల నిర్వహణకు అడహాక్ కమిటీలను నియమించినట్లు కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.
