దసరాకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరాకు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

అమరావతి: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో దూరప్రాంతాలకు నడుస్తున్న బస్సుల సంఖ్య పెంచాలని..  ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 15 నుంచి 28 వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నడిచినట్లే దూరప్రాంతాలకు 2,028 బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. డిమాండ్‌ మేరకు రిజర్వేషన్‌ చేసుకునే బస్సుల సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులపై చర్చలు ఇంకా పూర్తి సఫలం కాలేదు. దీంతో తెలంగాణకు బస్సులు నడపడం లేదు. ఇరు రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాకే తెలంగాణకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. అవసరమైతే తెలంగాణ సరిహద్దు వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.