సిటీలో ప్రొడక్షన్​ యూనిట్​ ఏర్పాటుకు కాన్​ఫ్లుయెంట్​ ఓకే

సిటీలో ప్రొడక్షన్​ యూనిట్​ ఏర్పాటుకు కాన్​ఫ్లుయెంట్​ ఓకే
  • ఆయా కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్​ భేటీ
  • రూ.వెయ్యి కోట్లతో మిడ్​మానేరులో యూనిట్​ పెడతామన్న ఫిష్​ఇన్​
  • హైదరాబాద్​లో ప్రొడక్షన్​ యూనిట్​ ఏర్పాటుకు కాన్​ఫ్లుయెంట్​ ఓకే

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చేపల హేచరీల సంస్థ ఫిష్​ఇన్​, మెడికల్​ పరికరాల తయారీ సంస్థ కాన్​ఫ్లుయెంట్​లు ముందుకొచ్చాయి. ఫిష్​ఇన్​, కాన్​ఫ్లుయెంట్​, అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీల ప్రతినిధులతో గురువారం మంత్రి కేటీఆర్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడ్తామని ఫిష్​ఇన్​ ప్రకటించింది. చేపల హేచరీలు, దాణా తయారీ, కేజ్​ కల్చర్​, ఫిష్​ ప్రాసెసింగ్​, ఎగుమతులపై తమ కంపెనీ పనిచేస్తుందని, రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్​మానేరు రిజర్వాయర్​ వద్ద తమ యూనిట్​ను ఏర్పాటు చేస్తామని సంస్థ సీఈవో మనీశ్​ తెలిపారు. యూనిట్​ పూర్తయిన తర్వాత ఏటా 85 వేల టన్నుల చేపలను ఎగుమతి చేస్తామని చెప్పారు. కాగా, ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉపాధి దొరుకుతుందని కేటీఆర్​ చెప్పారు. ముఖ్యంగా తమ రాష్ట్రంలోని యువత, మిడ్​మానేరు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని సీఈవోను ఆయన కోరారు. హైదరాబాద్​లో మెడికల్​ పరికరాల తయారీ యూనిట్​ను ఏర్పాటు చేస్తామని కాన్​ఫ్లుయెంట్​ప్రెసిడెంట్​, సీఈవో డీఆన్​ షావర్​ తెలిపారు. పైలట్​ప్రాజెక్టుగా ఒక ప్రొడక్షన్​  యూనిట్​ను ఏర్పాటు చేస్తామని, తర్వాత విస్తరిస్తామని చెప్పారు. అందుకు ప్రభుత్వ పరంగా అన్నిరకాలుగా సహకారం అందిస్తామని కేటీఆర్​ చెప్పారు.  

హైదరాబాద్​.. లైఫ్​సైన్సెస్​ హబ్​

లైఫ్​ సైన్సెస్​కు హైదరాబాద్​ హబ్​ అని కేటీఆర్​ అన్నారు. ఫార్మా, లైఫ్​సైన్సెస్​ సంస్థల ప్రతినిధులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్​లో రీసెర్చ్​ డెవలప్​మెంట్​, డిజిటల్​, టెక్​సెంటర్ల ఏర్పాటు, ప్రొడక్షన్​ ఇతర కార్యకలాపాలు చేపట్టేందుకు అనేక అవకాశాలున్నాయన్నారు. జీనోమ్​వ్యాలీ, మెడికల్​ డివైజెస్​ పార్క్​లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఫార్మాసిటీని ప్రారంభిస్తామని చెప్పారు.