గవర్నర్  కోటా ఎమ్మెల్సీలుగా అంతా లీడర్లేనా.?

గవర్నర్  కోటా ఎమ్మెల్సీలుగా అంతా లీడర్లేనా.?
  •     లిటరేచర్, సైన్స్, కళలు, సేవా రంగాల వారికి ఇవ్వాలి
  •     రాజ్ భవన్ కు వరుసగా ఫిర్యాదులు, అర్జీలు
  •     తమకు చాన్స్​ ఇవ్వాలంటూ ఉద్యమకారుల విజ్ఞప్తులు
  •     వాటన్నింటినీ సర్కారు పరిశీలనకు పంపిన గవర్నర్!
  •     రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ రాజకీయ నేతలకే ప్రయారిటీ

హైదరాబాద్, వెలుగుగవర్నర్  కోటాలో పొలిటికల్ లీడర్లను మాత్రమే ఎమ్మెల్సీలుగా నామినేట్​చేసే తీరు మారాలన్న చర్చ మొదలైంది. లిటరేచర్, సైన్స్, కళలు, సేవా రంగాల్లోని ప్రముఖులను నామినేట్​ చేయాలనే డిమాండ్  వినిపిస్తోంది. అసలు గవర్నర్​ కోటా అంటేనే వివిధ రంగాల్లో సేవ చేస్తున్నవారిని శాసన వ్యవస్థలో భాగం చేయడం కోసమని.. కానీ పొలిటికల్​ లీడర్లను నామినేట్​ చేస్తూ అసలు లక్ష్యాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ తీరుకు చెక్​పెట్టాలంటూ కొందరు లిటరేచర్, సేవా రంగాల ప్రముఖులు ఇటీవల గవర్నర్  తమిళిసైకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈసారి గవర్నర్  కోటా ఎమ్మెల్సీలుగా వివిధ రంగాలకు చెందిన వారిని నియమించాలని కోరినట్టు సమాచారం. కొందరైతే తమకు ఎమ్మెల్సీగా చాన్స్​ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇలా తన దగ్గరికి వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను గవర్నర్  ప్రభుత్వానికి పంపినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి.వాటిని టీఆర్ఎస్ కు చెందిన లీడర్లతో భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో పొలిటికల్  లీడర్లకు మాత్రమే చాన్స్ ఇవ్వొద్దని ఫిర్యాదులు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

పేరుకే గవర్నర్ కోటా

ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా గవర్నర్  కోటాలో ఎమ్మెల్సీలుగా రాజకీయ నేపథ్యం ఉన్న వారినే నామినేట్  చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ దక్కని వారికో, పోటీ చేసి ఓడిపోయినవారికో, అసెంబ్లీ, లోకల్ బాడీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్​ అందని వారికో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చాన్స్​ ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. ఇది గవర్నర్  కోటా ఏర్పాటు లక్ష్యానికి విరుద్ధమని రాజ్యంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చట్టాల రూపకల్పనలో కళలు, క్రీడలు, సైన్స్, సేవా రంగాలకు చెందిన ప్రముఖుల సలహాలు అవసరమని రాజ్యాంగం తయారైన సమయంలో డిమాండ్లు వచ్చాయని చెప్తున్నారు. అలాంటి వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే చాన్స్​ ఉండదన్న ఉద్దేశంతో శాసన మండలిలో గవర్నర్  కోటాను ఏర్పాటు చేశారని వివరిస్తున్నారు. అసలు కౌన్సిల్ లో 1/6 వంతు మందిని కేబినెట్ సలహా మేరకు నామినేట్  చేసే అధికారాన్ని గవర్నర్ కు కట్టబెట్టారు. కానీ గవర్నర్  కోటా పూర్తిగా అధికార పార్టీకి చెందిన లీడర్లకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి.

పదుల సంఖ్యలో ఫిర్యాదులు, అర్జీలు

గవర్నర్  కోటా ఎమ్మెల్సీల నియామకంపై తనకు వస్తున్న ఫిర్యాదులు, అర్జీలను గవర్నర్​ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి కూడా గవర్నర్  కోటాలో పొలిటికల్ లీడర్లను మాత్రమే ఎంపిక చేశారని ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో లిటరేచర్, కళా, సేవా రంగాలకు చెందిన సుమారు 15 మంది తమను ఎమ్మెల్సీగా నామినేట్​ చేయలంటూ బయోడేటాలను రాజ్ భవన్ కు పంపినట్టు తెలిసింది. కొందరైతే నేరుగా గవర్నర్ ను కలిసి బయోడేటాలను అందించినట్టు సమాచారం. ఇలా తనకు వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఆమె సర్కారుకు పంపారని ఆఫీసర్లు చెప్తున్నారు.

ఈ సారైనా తీరు మారుతదా?

చాలా విషయాల్లో తెలంగాణ కొత్త పంథాను ఎంచుకుంటోందని సీఎం కేసీఆర్  చెప్తుంటారని.. గవర్నర్  కోటా ఎమ్మెల్సీ నియామకాల్లో అలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది కవులు, కళాకారులు, సేవా రంగాలకు చెందినవాళ్లు కీలక పాత్ర పోషించారు. వారిలో చాలా మందికి చట్టసభలకు వెళ్లాలన్న ఆసక్తి ఉంది. ఉద్యమ సమయంలో వాడుకుని వదిలేశారని, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని కొందరు ఉద్యమకారుల్లో అసంతృప్తి ఉంది. ఈ క్రమంలోనే త్వరలో భర్తీ చేయనున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లలో రాజకీయ నేపథ్యం ఉన్న వారికి కాకుండా.. వివిధ రంగాల ప్రముఖులకు ఇవ్వాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.