పెట్రోలు బంకుల్లో రూ.2వేల నోట్లను తీసుకోవడం లేదా.. ఆర్బీఐ ఏం చెప్పింది

పెట్రోలు బంకుల్లో రూ.2వేల నోట్లను తీసుకోవడం లేదా.. ఆర్బీఐ ఏం చెప్పింది

2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి హైదరాబాద్‌లోని పెట్రోలు పంపులు, విక్రేతలు ఈ నోట్లను స్వీకరించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రూ.2వేల నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని ఆర్‌బీఐ ధృవీకరించినప్పటికీ, కొన్ని సంస్థలు మాత్రం వాటిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెట్రోల్ పంప్ వర్కర్ రూ.2వేల నోట్లను తీసుకోకపోవడాన్ని గమనించవచ్చు.

రూ. 2వేల నోటును కొంతమంది తీసుకోవడం లేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగా ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ లో రూ. 2వేల నోట్లను అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు ఓ వీడియో ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ కార్మికుడు ఖాతాదారులకు నోట్లను చెల్లింపుల కోసం ఉపయోగించకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని సూచిస్తున్నాడు.

ఇది కేవలం పెట్రోల్ పంపులే కాదు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆసుపత్రులు, ఫార్మసీలు, విక్రేతలు లావాదేవీల కోసం రూ.2వేల నోట్లను అంగీకరించడానికి వెనుకాడుతున్నారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్‌బీఐ ప్రకటన

రూ.2వేల డినామినేషన్‌ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటామని, అయితే అవి చట్టబద్ధంగానే ఉంటాయని ఆర్‌బీఐ ఇటీవలే ప్రకటించింది. రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా 2016లో రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టినట్లు సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా, RBI మొత్తం రూ.2వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది.

2023 సెప్టెంబరు 30 వరకు ప్రజలు రూ. 2వేల నోట్లను తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఇతర డినామినేషన్‌ల నోట్లతో మార్చుకోవచ్చని RBI ప్రకటించింది. అయితే, ఇది చట్టబద్ధమైనందున చెల్లింపులు చేయడానికి ఉపయోగించడం కొనసాగించవచ్చని తెలిపింది. రూ. 2వేల నోట్లు ఉపసంహరించుకునే వరకు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ ప్రకటించినప్పటికీ, హైదరాబాద్‌లోని కొంతమంది విక్రేతలు మరియు పెట్రోల్ పంపులు వాటిని చెల్లింపుగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం.

https://twitter.com/MdIbrahimlala2/status/1660007270493863936