పోరాటం కాంగ్రెస్‌‌ది.. క్రెడిట్‌‌ జనసేనకా?

పోరాటం కాంగ్రెస్‌‌ది.. క్రెడిట్‌‌ జనసేనకా?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  టీపీసీసీ సమావేశం మంగళవారం హాట్‌‌‌‌హాట్‌‌‌‌గా సాగింది. యురేనియం వ్యతిరేక ఉద్యమం, పార్టీ సభ్యత్వ నమోదు, ఆర్థిక మాంద్యంపై ప్రజల్లో ప్రచారం, గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు, సూర్యాపేట జిల్లాలో పోలీసుల తీరు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆ పార్టీ నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో సాగుతున్న యురేనియం వ్యతిరేక ఉద్యమం గురించి నాయకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది.

కాంగ్రెస్ దే క్రెడిట్..

ఉమ్మడి మహబూబ్‌‌‌‌ నగర్‌‌‌‌ జిల్లాలోని నల్లమల అడవుల్లో యురేనియం సర్వే, తవ్వకాలకు వ్యతిరేకంగా స్థానికంగా తనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, వంశీకృష్ణ కొట్లాడుతున్నామని ఈ ఉద్యమ క్రెడిట్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌దేనని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌‌‌‌ కుమార్‌‌‌‌ సమావేశం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీనిపై తాము కేంద్రంలో అధికారులను కూడా కలిశామని, యురేనియం తవ్వకాల విషయంలో కాంగ్రెస్‌‌‌‌ చేస్తున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి అసెంబ్లీలో తీర్మానం చేసిందని, ఇలాంటి సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ నిర్వహించిన రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశానికి కాంగ్రెస్‌‌‌‌ నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని కొందరు నాయకులు ప్రశ్నించినట్లు సమాచారం. యురేనియం వ్యతిరేక పోరాటం కాంగ్రెస్‌‌‌‌ ప్రారంభిస్తే.. ఆ క్రెడిట్‌‌‌‌ చివర్లో జనసేనకు దక్కేలా వ్యవహరించడం సరికాదని అన్నట్లు తెలిసింది. ఫారెస్ట్‌‌‌‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చేయాల్సిన తీర్మానం గురించి అఖిలపక్ష సమావేశంలో రేవంత్‌‌‌‌ రెడ్డి చెప్పడం తప్పని, ఈ డిమాండ్‌‌‌‌ను కాంగ్రెస్‌‌‌‌ సొంతంగా తీసుకెళ్తే బాగుండేదని కొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. యురేనియం వ్యతిరేక ఉద్యమంలో ముందు నుంచి ఉన్న తమకు అఖిలపక్ష సమావేశంలో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పారాచూట్ నేతలకు టికెట్లెందుకు?

పార్టీలో పదవులు, టికెట్లపై కూడా సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది. పారాచూట్‌‌‌‌  నేతలకు పదవులు, టికెట్లు ఎందుకు ఇస్తున్నారని పార్టీ నేత నిరంజన్ ప్రశ్నించగా.. దీనిపై దాసోజు శ్రవణ్ స్పందిస్తూ తాను కాంగ్రెస్  పార్టీ కోసం పనిచేస్తున్నానని, తాను పారాచూట్‌‌‌‌ నాయకుడిని కాదన్నారు.

ఫిరాయింపులపై ఫిర్యాదు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ర్టంలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతోందో గవర్నర్‌‌ తమిళిసైకి వివరించామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌‌ నేతల బృందం రాజ్‌‌భవన్‌‌కి వెళ్లి గవర్నర్‌‌ని కలిసింది. భేటీ తర్వాత వివరాలను భట్టి మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫిరాయింపులను ఎలా ప్రోత్సహించిందో వివరించామని చెప్పారు.