తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: మక్కలతో పాటు జొన్నలు కూడా కొనాలని ప్రభుత్వ నిర్ణయం

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: మక్కలతో పాటు జొన్నలు కూడా కొనాలని ప్రభుత్వ నిర్ణయం

తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొక్కజొన్న పంటతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, 2026 మే 05వ తేదీన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్ర రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటనిస్తుందని ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న, జొన్న పంటలను Price Support Scheme (PSS) పరిధిలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కోరినప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా మొక్కజొన్న, జొన్న పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు బహిరంగ మార్కెట్లో లభించిన ధరలకే తమ పంటను అమ్ముకుంటున్నారని మంత్రి తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాసంగి సీజన్‌లో 278 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 5.50 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతులకు నష్టం కలగకుండా కనీస మద్దతు ధర (MSP) వద్ద కొనుగోళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్ సీజన్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3.76 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి రూ.902.80 కోట్ల వ్యయం భరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

►ALSO READ | హైదరాబాద్ ORR పై 33 శాతం యాక్సిడెంట్స్కు కారణం నిద్రమత్తే !

ప్రస్తుతం రైతులు తమ జొన్న పంటను మార్కెట్లకు తీసుకురావడం ప్రారంభించిన నేపథ్యంలో, మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మొక్కజొన్న తరహాలోనే జొన్న పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల జొన్న రైతులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత రబీ సీజన్‌లో రాష్ట్రంలో మొక్కజొన్న పంటను సుమారు 11.21 లక్షల ఎకరాలలో సాగు చేయగా, అనుకూల వాతావరణ పరిస్థితులతో ఎకరానికి సగటు 26.57 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే జొన్న పంటను 3.68 లక్షల ఎకరాలలో సాగు చేయగా, ఎకరానికి సరాసరి క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు.

ఈ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్ల కోసం దాదాపు రూ.6000 కోట్ల వరకు వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆదాయ భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.