తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఏకైక అధికారిక సంస్థ 'మా' (Movie Artist Association) లేటెస్ట్ గా ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నటీనటుల తరపున మాట్లాడే అధికారం, గుర్తింపు ఉన్న ఏకైక సంఘం తమదేనని స్పష్టం చేసింది. సమాంతరంగా పుట్టుకొస్తున్న నకిలీ సంఘాలను నమ్మి మోసపోవద్దని సూచించింది.
రంగంలోకి నకిలీ సంఘాలు!
ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు, అనధికారిక బృందాలు 'ఏపీ మా' (AP MAA), 'మా ఏపీ' (MAA AP) వంటి పేర్లతో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి, నటీనటులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు 'మా' కార్యవర్గం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా వర్ధమాన కళాకారులను లక్ష్యంగా చేసుకుని, సభ్యత్వాల పేరుతో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది.
గుర్తింపు ఉన్నది మాకే..
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ , తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గుర్తింపు ఉన్న ఏకైక అసోసియేషన్ తమదేనని 'మా' వెల్లడించింది. పరిశ్రమలోని 24 విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సభ్యుల ప్రయోజనాల కోసం పని చేసే హక్కు కేవలం తమకే ఉందని, 'మా' పేరును అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ALSO READ : 25 నిమిషాల పాటు తేరుకోలేకపోయా..
మంచు విష్ణు టీమ్ కీలక విజ్ఞప్తి
ప్రస్తుతం మంచు విష్ణు అధ్యక్షతన కొనసాగుతున్న 'మా' కార్యవర్గం, నటీనటులకు పలు సూచనలు చేసింది. ఎవరూ అనధికారిక సంస్థలకు సభ్యత్వ రుసుములు కానీ, విరాళాలు కానీ చెల్లించవద్దని కొరింది. ఎవరు పడితే వారు 'మా' పేరుతో డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు. ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని 'మా' కార్యాలయాన్ని సంప్రదించాలని సూచింది.. మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరింది.. టాలీవుడ్ గౌరవాన్ని, సమగ్రతను దెబ్బతీసే ఇలాంటి దందాల పట్ల కళాకారులు అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక వేదికల ద్వారానే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
