న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. షెన్‌జెన్ మాస్టర్స్ చెస్ టోర్నీలో మిశ్రమ ఫలితాలు నమోదు చేశాడు. తొలి రౌండ్‌లో గెలిచిన అతను రెండో రౌండ్‌లో ఓటమిపాలయ్యాడు. శుక్రవారం జరిగిన సెకండ్ రౌండ్ గేమ్‌లో అర్జున్ 36 ఎత్తుల వద్ద గ్రాండ్ మాస్టర్ బ్యూ జియాంగ్జీ (చైనా) చేతిలో కంగుతిన్నాడు. తెల్లపావులతో ఆడిన తెలంగాణ ప్లేయర్ గేమ్ మధ్యలో పట్టువదిలాడు.
అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో అర్జున్ 64 ఎత్తులతో చైనా గ్రాండ్ మాస్టర్ జియాంగ్యూ యూపై గెలిచాడు. ఈ విజయంతో అర్జున్ లైవ్ రేటింగ్‌లో ఇండియా నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకోగా, వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 11వ ప్లేస్‌లో నిలిచాడు. 2019లో ఇదే ప్రత్యర్థితో జరిగిన క్లాసికల్ గేమ్‌ను డ్రా చేసుకున్న తెలంగాణ ప్లేయర్ ఈసారి మాత్రం తన మార్క్ ఆటను చూపెట్టాడు.
ఎండ్ గేమ్‌లో జియాంగ్యూ చేసిన చిన్న తప్పిదాన్ని తనకు అనుకూలంగా మల్చుకుని గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్నాడు. మరోవైపు ప్రేగ్ మాస్టర్స్‌లో యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద వరుసగా రెండో ఓటమిని చవిచూశాడు. మూడో రౌండ్‌లో ప్రజ్ఞానంద.. రిచర్డ్ రాపోర్ట్ (రొమేనియా) చేతిలో ఓడాడు. గుకేశ్.. విధితి గుజరాతీ మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది.
