బంగారం దోపిడీ దొంగలు..మహారాష్ట్ర వైపు పరార్‌‌!

 బంగారం దోపిడీ దొంగలు..మహారాష్ట్ర వైపు పరార్‌‌!

 

  • గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్లిన దోపిడీ ముఠా 
  • వచ్చిన దారిలోనే వెళ్తూ.. ఇప్పటికే రాష్ట్రం దాటిన గ్యాంగ్
  • నిందితులంతా పాత నేరస్తులుగా గుర్తింపు
  • మహారాష్ట్రలోని నందుర్బర్‌‌కు నాలుగు టీమ్స్‌‌
  • సీసీ కెమెరాలు, మొబైల్‌‌ టవర్‌‌ లొకేషన్‌‌ ఆధారంగా గాలింపు

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో సుమారు కిలోన్నర బంగారం దోచుకెళ్లిన ముఠా సభ్యులు.. రాష్ట్ర పోలీసుల కండ్లు గప్పి తమ సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర వైపు పరారైనట్లు తెలిసింది. దోపిడీ అనంతరం పల్సర్, అపాచీ బైక్‌‌‌‌లపై శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్‌‌‌‌, రామడుగు మండలం రుద్రారం మీదుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత గంగాధర మండలం దాటి జగిత్యాల జిల్లా పెగడపల్లి, గొల్లపల్లి, వెంగళాయిపేట మీదుగా జగిత్యాల చేరుకుని, అక్కడి నుంచి నిజామాబాద్‌‌‌‌ లేదా ధర్మపురి వైపు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్గమధ్యలో వాహనాలు మారి మహారాష్ట్రకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు, పోలీస్‌‌‌‌ నిఘా ఎక్కువగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

వచ్చిన దారిలోనే పారిపోయిన  దొంగలు 

దోపిడీకి పాల్పడిన వ్యక్తులు ఆదివారం ఉదయమే కరీంనగర్‌‌‌‌కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం 8.23 గంటలకు ఐదుగురు వ్యక్తులు రెండు బైక్‌‌‌‌లపై వస్తుండడం రామడుగు మండలం మోతె రుద్రారం గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డయింది. మోతె రుద్రారం గ్రామం నుంచి పీఎంజే జ్యువెల్లరీ షాపునకు సుమారు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనిని బట్టి ఉదయం 9 గంటలకు కరీంనగర్‌‌‌‌ సిటీకి చేరుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 11.12 గంటలకు దోపిడీ ముగించుకున్న తర్వాత.. 11.35 గంటలకు తిరిగి వెళ్తున్నట్లు అదే రుద్రారం గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీన్ని బట్టి వారు వచ్చిన రూట్‌‌‌‌లోనే పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

క్లూ ఇచ్చిన బ్యాగ్‌‌‌‌ 

జ్యువెల్లరీ షాపు నుంచి దొంగలు పారిపోయే క్రమంలో తమ వెంట తీసుకొచ్చిన బ్యాగ్‌‌‌‌ను అక్కడే వదిలేశారు. ఆ బ్యాగుపై ‘ఐ లవ్‌‌‌‌ నందుర్బర్‌‌‌‌’ అని ఇంగ్లిష్‌‌‌‌లో ఉంది. నందుర్బర్‌‌‌‌ అనేది మహారాష్ట్రంలోని ఓ పట్టణం. దీంతో దొంగలు మహారాష్ట్రకు చెందినవారేనన్న అనుమానాలకు బలం చేకూరింది. మరో వైపు దొంగలు బిహార్‌‌‌‌కు చెందిన వారిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. దేశంలో వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కొనేందుకు వినియోగించే నేషనల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ గ్రిడ్‌‌‌‌, దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానమైన క్రైమ్‌‌‌‌ అండ్‌‌‌‌ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ అండ్‌‌‌‌ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) డేటా బేస్ ద్వారా కూడా ఈ ముఠా మహారాష్ట్రకు చెందినదేనని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. 

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ నంబర్ల  ఆధారంగా ట్రేసింగ్‌‌‌‌

దోపిడీ ముఠా కోసం కరీంనగర్ పోలీసులతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇందులో నాలుగు టీమ్‌‌‌‌లు  సీసీ కెమెరాలు చెక్ చేస్తుండగా.. మరో తొమ్మిది టీమ్‌‌‌‌లు మహారాష్ట్రలో గాలిస్తున్నట్లు తెలిసింది. దోపిడీ జరిగిన సమయంలో సెల్‌‌‌‌ టవర్‌‌‌‌ పరిధిలో అనుమానాస్పద ఇన్‌‌‌‌కమింగ్‌‌‌‌, అవుట్‌‌‌‌ గోయింగ్‌‌‌‌ కాల్స్‌‌‌‌ను గుర్తించడంతో పాటు ఇతర రాష్ట్రాల నంబర్లను ట్రేస్‌‌‌‌ చేసినట్లు తెలిసింది. వీటి ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు  ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీజీపీగా సీవీ ఆనంద్‌‌‌‌ బాధ్యతలు తీసుకున్న మూడో రోజే ఈ దోపిడీ జరగడంతో కేసును సవాల్‌‌‌‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఉద్యోగి ఫోన్‌‌‌‌ తీసుకెళ్లిన దొంగలు

దొంగలు పీఎంజే జ్యువెల్లరీ షాపులోకి ప్రవేశించగానే మొదట అక్కడి ఉద్యోగుల ఫోన్లను లాక్కున్నారు. తిరిగి వెళ్లే ముందు అందరి ఫోన్లను అక్కడే వదిలేసినప్పటికీ.. హనుమాన్‌‌‌‌ మాలలో ఉన్న ఓ ఉద్యోగి ఫోన్‌‌‌‌ను మాత్రం తమ వెంట తీసుకెళ్లారు. తన ఫోన్‌‌‌‌ తీసుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు చెప్పడంతో దానిని ట్రేస్‌‌‌‌ చేయగా.. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దొరికింది. దొంగలు పారిపోతూ ఆ ఫోన్‌‌‌‌ను యూనివర్సిటీ దగ్గర వదిలేయడంతో వారు మల్కాపూర్‌‌‌‌ వైపు వెళ్లినట్లు తేలింది.