కరీంనగర్ లో ఆయుధాలతో బెదిరించి.. తాళ్లతో బంధించి..!.54 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.25 లక్షలు చోరీ

కరీంనగర్ లో ఆయుధాలతో బెదిరించి.. తాళ్లతో బంధించి..!.54 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.25 లక్షలు చోరీ
  •     కరీంనగర్ భగత్ నగర్ లో ఘటన

కరీంనగర్/హుజురాబాద్, వెలుగు : కరీంనగర్ లో పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ మరువకముందే మరో భారీ దోపిడీ జరిగింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భగత్ నగర్ సమీపంలోని అజ్మత్​అలీ ఇంట్లోకి చొరబడి ఆయనతో పాటు అతడి భార్య, ఇద్దరు కూతుళ్లను ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి బంగారం, డబ్బు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అజ్మత్​ అలీకి నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురు సాజిదాబేగం భర్త రజావుద్దీన్ నిత్యం వేధిస్తుండడంతో ఆమె ఏడాదిగా పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెతో పాటు  ఆమె చెల్లెలు ఆఫ్రిన్ కూడా అక్కడే ఉంటోంది. మంగళవారం రాత్రి లైట్ ఆఫ్ చేసేందుకు అజ్మత్ అలీ కిందకు వెళ్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి కత్తులతో బెదిరించి నోరు మూసేశారు. హాల్ లోకి తీసుకొచ్చి తల, ముఖంపై కొట్టారు. తర్వాత అజ్మత్ అలీ భార్య, ఇద్దరు కూతుళ్లను కూడా కొట్టి తుపాకులు, కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేశారు.

అనంతరం వారి ఒంటిపై ఉన్న ఉంగరాలు, ఆభరణాలతో పాటు బీరువాలో ఉన్న నగలు, నగదు, రెండు ఫోన్లతో పాటు పార్కింగ్ లో ఉన్న రెండు బైక్ లను తీసుకొని పరార్ అయ్యారు. తర్వాత అజ్మత్ అలీ తన కుమారుడు అస్మత్ కు ఫోన్ చేసి చెప్పగా.. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను హాస్పిటల్ కు తరలించారు. దుండగులు ఇంట్లో ఉన్న 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.25 లక్షలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తులం బంగారం విలువ ప్రస్తుతం లక్షన్నరకు చేరువలో ఉండగా.. ఫిర్యాదులో మాత్రం రూ. 30 వేలుగా పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న సీపీ గౌష్ ఆలం బుధవారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. 

పెద్దల్లుడిపైనే అనుమానం

అజ్మత్ అలీ పెద్దల్లుడు రజావుద్దీన్ ది ఉత్తర ప్రదేశ్ లోని మీరట్. అతడు జూన్ 17న కరీంనగర్ కు వచ్చి తమ కారు, సామాన్లు తీసుకెళ్లాడని, ఇప్పుడు దొంగలు కూడా ఉత్తరాది హిందీ మాట్లాడుతున్నారని అజ్మత్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీన్ని బట్టి ఈ దోపిడీకి పాల్పడింది రజావుద్దీన్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే దుండగులు ఎత్తుకెళ్లిన బైక్ లు హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద కనిపించాయి. కరీంనగర్ నుంచి డీసీపీ వెంకటరమణ, సీఐ కోటేశ్వర్, పోలీస్ బృందాలతో పాటు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు వెళ్లి ఆధారాలు సేకరించారు.