రైల్వే ప్లాట్ ఫాంపై గర్భిణి డెలివరీ.. హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్తో కాన్పు నిర్వహించిన ఆర్మీ డాక్టర్

రైల్వే ప్లాట్ ఫాంపై గర్భిణి డెలివరీ.. హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్తో కాన్పు నిర్వహించిన ఆర్మీ డాక్టర్
  • యూపీలోని ఝాన్సీలో ఘటన

ఝాన్సీ(యూపీ): తీవ్రమైన పురిటి నొప్పులతో ఓ గర్భిణీ స్త్రీ రైల్వే ప్లాట్ ఫాంపైనే ప్రసవించింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ రైల్వే స్టేషన్ లో శనివారం ఈ ఘటన జరిగింది. ఓ గర్భిణీ స్త్రీ తన కుటుంబ సభ్యులతో పన్వేల్, గోరఖ్ పూర్  ఎక్స్ ప్రెస్ లో జర్నీ చేస్తోంది. ప్రయాణం మధ్యలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ట్రైన్  ఝాన్సీ స్టేషన్ లో ఆగినప్పుడు ఆమెను రైల్వే సిబ్బంది కిందికి దించారు. అదే టైంలో హైదరాబాద్ కు వెళ్లడానికి వేచిచూస్తున్న ఆర్మీ డాక్టర్  రోహిత్  బాచ్ వాలా (31) ఆ మహిళను చూశారు. 

ఓ రైల్వే ఉద్యోగి ఆ మహిళను వీల్ చైర్ లో అత్యవసరంగా తీసుకెళ్తుండగా.. వెంటనే ఫీమేల్  టికెట్  చెకింగ్  స్టాఫ్​ తో రోహిత్.. గర్భిణి స్త్రీ వద్దకు వెళ్లారు. ప్లాట్ ఫాంపైనే తాత్కాలిక డెలివరీ ఏరియా ఏర్పాటు చేశారు. రైల్వే సిబ్బంది సాయంతో మహిళకు విజయవంతంగా కాన్పు నిర్వహించారు. అయితే, ఈ ప్రక్రియనంతా రోహిత్.. ఒక హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్ తో చేయడం విశేషం. ఆ టైంలో గర్భిణీ స్త్రీకి డెలివరీ ప్రక్రియ చేయడానికి హెయిర్ క్లిప్, పాకెట్ నైఫ్  తప్ప పెద్దగా టూల్స్  ఏమీ లేవు. 

అయినా కూడా రోహిత్  ఆ టూల్స్ తోనే ఆమెకు విజయవంతంగా డెలివరీ ప్రక్రియ నిర్వహించారు. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఇద్దరినీ సమీపంలోని ఆసపత్రికి తరలించారు. ఈ దృశ్యాలను చూసిన అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. రోహిత్ ను అభినందలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా డాక్టర్  రోహిత్  మాట్లాడుతూ పురిటి నొప్పులతో ఆ మహిళ స్పృహ కోల్పోయిందన్నారు. ‘‘ఆ టైంలో ప్రతీ క్షణం విలువైనదే. వెంటనే మేము తాత్కాలిక డెలివరీ ఏరియా ఏర్పాటు చేశాం. దేవుడి దయ వల్ల మహిళ సేఫ్​ గా ప్రసవించేలా చూశాను. ఆ టైంలో నేను స్టేషన్ లో ఉండడం నిజంగా దేవుడి అద్భుతమే” అని రోహిత్  తెలిపారు. కాగా.. తల్లీశిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.