'జూమ్‌'కు ఆర్మీ అధికారుల నివాళి

'జూమ్‌'కు ఆర్మీ అధికారుల నివాళి

ఇటీవల ఇండియన్ ఆర్మీలోని జూమ్ అనే కుక్క మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆ శునకానికి సెల్యూట్ చేస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ డాగ్ యూనిట్ జూమ్ సేవలను గుర్తు చేసుకుంది. అందులో భాగంగా మిగతా ఆర్మీ డాగ్స్ ను సైతం ఆ శునకానికి సంతాపంగా అధికారులు తీసుకువచ్చారు. జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లా టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. అనంతరం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. అయితే ఈ ఆపరేషన్ లో జూమ్ అనే ఆర్మీ డాగ్ కూడా పాల్గొంది. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్‌' అనే ఆర్మీ కుక్కను అధికారులు పంపగా... అది వారిపై దాడి చేసింది.

ఆ సమయంలో కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా 'జూమ్' వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత అధికారులు 'జూమ్'ను  హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. శ్రీనగర్‌లోని వెటిర్నరీ హాస్పిటల్‌లో రెండు రోజులుగా చికిత్స పొందిన ఈ శునకం.. ఇటీవలే కన్నుమూసింది.