సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

సూర్యాపేట, వెలుగు: అగ్ని వీర్ స్కీమ్ లో భాగంగా ఈ నెల 15 నుంచి 31వరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర కాలేజీలో ఆర్మీ రిక్రూట్​మెంట్​ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులకు ఫిట్ నెస్, మెడికల్, రన్నింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఆఫీసర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 60 వేల మంది యువత పాల్గొంటారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. రోజుకు 5 వేల మంది అభ్యర్థులకు టెస్టులు నిర్వహించనున్నారు. అగ్ని వీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్, అగ్ని వీర్ ట్రేడ్స్ మెన్, టెన్త్ పాస్, ఎనిమిది పాస్ కేటగిరీ లో నియామకాలు చేపట్టనున్నారు. 

పూర్తయిన ఏర్పాట్లు

ఆర్మీ రిక్రూట్​మెంట్​ర్యాలీలో పాల్గొనే అభ్యర్థుల కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్లను ఆర్మీ ఆఫీసర్లతో పాటు రెవెన్యూ, మెడికల్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీవో, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ తయారీ, గ్రౌండ్ లో బారికేడ్లు, లైటింగ్, రన్నింగ్ ట్రాక్ తదితర పనులు పూర్తయ్యాయి. పరిసర ప్రాంతాల ప్రజలు లోపలికి రాకుండా పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో పాటు ఆర్మీ ఆఫీసర్ల కోసం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్స్ తో పాటు హోటల్స్ లలో వసతి ఏర్పాట్లు చేశారు. వర్షంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వాటర్ ఫ్రూఫ్ టెంట్స్ రెడీ చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది.