
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌పై జరిపిన దాడులకు సంబంధించిన మరో వీడియోను ఇండియన్ ఆర్మీ ఆదివారం విడుదల చేసింది. తమది ప్రతీకార దాడి కాదని.. బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయమని పేర్కొన్నది. ‘ప్లాన్డ్.. ట్రెయిన్డ్.. ఎగ్జిక్యూటెడ్’ కోట్‌తో ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ అధికారులు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత ఈ నెల 7న పీవోకేలో ఉన్న టెర్రరిస్టు క్యాంపులపై ఇండియన్ ఆర్మీ దాడులు ప్రారంభించింది.
దాడులకు ఎలా ప్లాన్ చేశారు.. దాని కోసం ఎలా సన్నద్ధం అయ్యారు.. ఫైనల్‌గా ఎలా ఎగ్జిక్యూట్ చేశారో ఈ వీడియోలో ఆర్మీ అధికారులు వివరించారు. పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించారు. తరతరాలు గుర్తుంచుకునేలా పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో దాడులు చేసినట్లు వివరించారు. ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు. ఇండియన్ ఆర్మీ చేసిన దాడులకు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కావడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. టెర్రరిస్ట్ క్యాంపులు మంటల్లో కాలిబూడిదయ్యాయి.
మే 9న రాత్రి 9 గంటల టైమ్‌లో దాడులకు సంబంధించిన వీడియోలు అని ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆర్మీ దాడులకు భయపడి టెర్రరిస్టులు పారిపోతున్న దృశ్యాలు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మే 7న దాడులు చేసింది. ఆ తర్వాత మే 9 అర్ధరాత్రి, 10వ తేదీన ఆ దేశంలోని కీలక వాయుసేన స్థావరాలపై దాడులు చేశామని ఇండియా
ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపింది.