గల్వాన్, తవాంగ్‌‌లో ధైర్యసాహసాలు చూపారు: రాజ్‌‌నాథ్

గల్వాన్, తవాంగ్‌‌లో ధైర్యసాహసాలు చూపారు: రాజ్‌‌నాథ్
  • ఇండియా సూపర్‌‌ ‌‌పవర్‌‌‌‌గా మారాలి
  • 2014 నుంచి దేశంలో కొత్త శకం మొదలైందని వెల్లడి
  • ఫిక్కీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కామెంట్స్

న్యూఢిల్లీ: గల్వాన్ వ్యాలీ, తవాంగ్ సెక్టార్‌‌‌‌లో జరిగిన గొడవల సమయంలో మన సైనికులు చూపిన ధైర్యసాహసాలు అభినందనీయమని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ అన్నారు. వారిని ఎంత పొగిడినా సరిపోదని చెప్పారు. శనివారం ఫిక్కీ సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి.. ‘‘ప్రపంచ శ్రేయస్సు కోసం సూపర్‌‌‌‌  పవర్‌‌‌‌గా మారాలని ఇండియా కోరుకుంటున్నది. అయితే ఇందులో ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశం కానీ, ఏ ఒక్క దేశానికి చెందిన ఒక ఇంచ్ భూమిని స్వాధీనం చేసుకునే ఆలోచన కానీ లేదు” అని పరోక్షంగా చైనాపై విమర్శలు చేశారు. ‘‘ఒకవేళ మేం సూపర్‌‌‌‌ పవర్‌‌‌‌ కావాలని అనుకుంటే.. ప్రపంచ ప్రయోజనం, శ్రేయస్సు కోసమే సూపర్‌‌‌‌ పవర్‌‌‌‌గా ఇండియా అవతరించాలని ఆకాంక్షిస్తాం. ప్రపంచం.. మన కుటుంబం’’ అని చెప్పుకొచ్చారు. 

ప్రపంచ ఎజెండా నిర్ణయించే పనిలో ఉన్నం

‘‘స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ప్రపంచంలోని ఆరేడు అతిపెద్ద ఎకానమీల్లో ఒకటిగా ఇండియా ఉంది. చైనాలో 1949 రెవెల్యూషన్ తర్వాత కొత్త వ్యవస్థ వచ్చింది. అప్పటికి చైనా జీడీపీ ఇండియా కంటే తక్కువ. 1980 దాకా ఇండియా, చైనా కలిసి సాగాయి. తర్వాత ఆర్థిక సంస్కరణలతో చైనా ముందుకు దూసుకుపోయింది. 1991లో ఆర్థిక సంస్కరణలు మన దేశంలో కూడా మొదలయ్యాయి. కానీ తక్కువ సమయంలోనే చైనా లాంగ్ జంప్ చేసింది. అమెరికా తప్ప.. మిగతా అన్ని దేశాలను అభివృద్ధి పథంలో వెనక్కి నెట్టింది’’ అని అని రాజ్‌‌నాథ్ చెప్పారు. 21వ శతాబ్దంలో ఇండియా టాప్ 10 ఎకానమీల్లో చోటు దక్కించుకుందని, కానీ దేశంలో జరగాల్సినంతగా అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు. 2014లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక.. అభివృద్ధిలో కొత్త శకం మొదలైందని అన్నారు. నాడు ప్రపంచంలో తొమ్మిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా.. ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందని చెప్పారు. ప్రపంచ వేదికపై ఎజెండాను నిర్ణయించే పనిలో ఇండియా ఉందని పేర్కొన్నారు. 

ప్రతి రూపాయీ ప్రజలకే చేరుతోంది..

సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందని 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రాజ్‌‌నాథ్ ప్రస్తావించారు. తమ ప్రభుత్వం చేసిన మార్పులతో మొత్తం రూపాయీ ప్రజలకు చేరుతున్నదని చెప్పుకొచ్చారు. ‘‘నేను ఆయన (రాజీవ్ గాంధీ) ఉద్దేశాన్ని అనుమానించట్లేదు. ఆయన తన ఆవేదనను నిజాయితీగా వ్యక్తంచేశారు. ఇప్పుడు సిస్టమాటిక్ మార్పులు జరిగాయి. 100 పైసలు పైనుంచి రిలీజ్ చేస్తే.. మొత్తం ప్రజలకు చేరుతున్నది” అని తెలిపారు.

ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే ధోరణి మారాలె..

చైనాతో బార్డర్ గొడవ విషయంలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపైనా రాజ్‌‌నాథ్ స్పందించారు. ‘‘గల్వాన్ లేదా తవాంగ్‌‌లో మన సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు వారిని ఎంత ప్రశంసించినా సరిపోదు. ప్రతిపక్షంలోని ఓ లీడర్ ఉద్దేశాన్ని మేం ఎన్నడూ ప్రశ్నించలేదు. విధానాల ఆధారంగానే మేం చర్చలు జరిపాం. రాజకీయాలనేవి నిజాలపై ఆధారపడి ఉండాలి. అబద్ధాల ఆధారంగా ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేం’’ అని చెప్పారు. సమాజాన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్లే ప్రక్రియను 'రాజనీతి' (రాజకీయం) అంటారని, ఎల్లప్పుడూ ఒకరి ఉద్దేశాన్ని అనుమానించడం వెనుక కారణమేంటో తనకు అర్థం కాదని కామెంట్ చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, తీసుకొచ్చే ప్రతి స్కీమ్‌‌ను వ్యతిరేకించే ధోరణిని ప్రతిపక్షం మానుకోవాలని, అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని హితవుపలికారు.