
హైదరాబాద్ సిటీ, వెలుగు: సెప్టెంబర్ 6న జరిగే గణేశ్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 30 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. బయటి జిల్లాల నుంచి 8,500 మంది పోలీసులు, సీఏపీఎఫ్, ఆక్టోపస్ బృందాలను మోహరిస్తున్నామన్నారు. గురువారం ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించున్న అనంతరం ఆయన మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ఉత్సవాల నిర్వాహకులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని తెలిపారు.10,900 మండపాలకు ఆన్లైన్ అనుమతులు ఇచ్చామని, మిగిలిన 15 వేల విగ్రహాల రికార్డులను సేకరిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన ఊరేగింపులను సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, క్యూఆర్ కోడ్ ఆధారిత స్టిక్కర్లతో పర్యవేక్షించనున్నట్లు సీపీ ఆనంద్ వివరించారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద ఉమ్మడి నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఈ ఏడాది బోనాలు వంటి పండుగలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చినందున, ఖైరతాబాద్ గణేశ్ ను సందర్శించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని సీపీ ఆనంద్ అంచనా వేశారు. సాధారణ రోజుల్లో 60- – 70 వేల మంది, వారాంతాల్లో ఒకటి నుంచి రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి తొక్కిసలాట జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున మండపాల నిర్వాహకులు కరెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. సరైన కనెక్షన్లు తీసుకోవాలని, తడిసిన కట్టెలు విద్యుత్ ప్రసారం చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. మండపాల వద్ద వాలంటీర్లను నియమించి బారికేడింగ్‌ను పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, డీసీపీలు కె. అపూర్వరావు, కె.శిల్పావల్లి తదితరులు పాల్గొన్నారు.