నత్తనడకన నాగోబా జాతర ఏర్పాట్లు

నత్తనడకన నాగోబా జాతర ఏర్పాట్లు
  • ఉన్నది పది రోజులే.. పనులు షురూ కాలె!
  • నత్తనడకన నాగోబా జాతర ఏర్పాట్లు
  • ఇంకా రివ్యూ నిర్వహించకపోవడంపై ఆదివాసీల ఆగ్రహం
  • మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
  • ఆలయ నిర్మాణానికి మరో ఏడాది పట్టే చాన్స్ 

ఆదిలాబాద్‍, వెలుగు: రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీల జాతర నాగోబా ఉత్సవాలకు ఇంకా పది రోజులే టైం ఉంది. కానీ నేటికీ జాతర ఏర్పాట్లు కొలిక్కి రాలేదు. కోట్ల రూపాయలతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే మెస్రం వంశీయులు గంగాజలంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల 27న వారంతా కేస్లాపూర్​కు చేరుకోనుండగా.. ఆలోపు జాతర ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నాగోబా జాతర ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రివ్యూ నిర్వహిస్తే తమ సమస్యలను తెలియజేయడంతో పాటు కావాల్సిన సదుపాయాలు, నిధుల విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేవారమని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే జాతర ఏర్పాట్లపై ఐటీడీఏ పీఓ చర్చించగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నెల రోజుల ముందే అధికారికంగా జాతర ఏర్పాట్లపై పలుసార్లు రివ్యూలు జరిగేవి. తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేవారు. కానీ ఈసారిమాత్రం ఇప్పటివరకు అధికారికంగా మీటింగ్ పెట్టలేదని, సమయం దగ్గరపడుతున్నా ఇంకా ఏ పనులు ఎలా చేయాలి.. దానికి సంబంధించిన ఫండ్స్​విషయమై క్లారిటీ రాలేదని చెబుతున్నారు. రివ్యూలో దర్బార్, ఆటల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కచ్చితంగా దర్బార్ తో పాటు ఆటలు నిర్వహించాలని మెస్రం వంశీయులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా దృష్ట్యా ఈ ఏర్పాట్లపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

ఫండ్స్​ వస్తలేవు
ఆలయ నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కోసం గత ఏడాది ప్రభుత్వం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. ఈ ఫండ్స్​ను ఆలయ మండపం, గోపురం,  క్రీడా మైదానం, దర్బార్ హాల్, లైటింగ్ తదితర పనులకు కేటాయించారు. మెస్రం వంశీయులు ప్రధాన గర్భగుడిని సొంతంగా రూ. కోటితో నిర్మించుకుంటున్నారు.  మిగతా పనుల కోసం ప్రభుత్వం నుంచి ఫండ్స్​రాకపోవడంతో కొంతమేర ఆలయ నిధులు ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రహరీ పూర్తి కాగా మండపం, గోపురం పనులు కొనసాగుతున్నాయి. ఆలయం పూర్తి కావాలంటే మరో ఏడాది పట్టే చాన్స్ ఉంది. కరోనా కారణంగా పనుల్లో జాప్యం జరుగుతోందని ఆలయ కమిటీ చైర్మన్ చెబుతున్నారు. 

ఏర్పాట్లు చేసేదెప్పుడు?
ఆలయంలో జాతర ఏర్పాట్లకు సంబంధించి పనులు ఇంకా మొదలు పెట్టలేదు. ప్రస్తుతం ఆలయం వెనకాల పర్మినెంట్ టాయిలెట్లు నిర్మించినప్పటికీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటికి రిపేర్లు చేపట్టాల్సి ఉంది. దీంతోపాటు వాటర్ సప్లై కోసం నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కోనేరు శుద్ధి చేయడం, కేస్లాపూర్ మర్రిచెట్టు వద్ద తాగునీటి సదుపాయం కల్పించడం, జాతరకు ఎడ్లబండ్లతో వచ్చేవారి పశువుల కోసం తాగునీటి తొట్లు తదితరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.  గత ఏడాది ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు వేసిన రోడ్డు చాలాచోట్ల దెబ్బతింది. దీనికి రిపేర్లు చేయాల్సి ఉంది.  ప్రస్తుతం ఆలయం ఎదుట ఎన్‍ఆర్ఈజీఎస్ నిధులతో లైటింగ్ పనులు మాత్రం చేపడుతున్నారు.

సమయానికి ఏర్పాట్లు పూర్తి చేస్తాం
ఆలయం పనులు కొనసాగుతున్నాయి. జాతర సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే ఏర్పాట్లపై ఐటీడీఏ పీఓకు విన్నవించాం. తాగునీటి కోసం ఆర్ డబ్ల్యూఎస్ ఆఫీసర్లు పరిశీలించారు. ప్రస్తుతం లైటింగ్ పనులు కొనసాగుతున్నాయి. కలెక్టర్ ద్వారా నిర్వహించే రివ్యూ ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా రివ్యూ నిర్వహించాలని కోరాం. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 6 కోట్లు కాకుండా కొత్తగా పనుల కోసం మరో రూ. 2 కోట్ల వరకు అవసరం ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లా. మహారాష్ట్ర నుంచి సైతం భారీగా భక్తులు వస్తుంటారు. కరోనా రూల్స్​కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం. 
– ఆనంద్ రావు, ఆలయ కమిటీ చైర్మన్