వచ్చే నెలలో ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం

వచ్చే నెలలో ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం

హైదరాబాద్, వెలుగు:  ఉప్పల్ భగాయత్ లే అవుట్​లో 44 ప్లాట్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ అధికారులు సోమవారం ఈ– ఆక్షన్ ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఉప్పల్ వెంచర్​లో నిర్వహించిన ఈ సమావేశానికి  స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు బిల్డర్లు, డెవలపర్లు, కంపెనీలు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇ–ఆక్షన్ కు సంబంధించిన రూల్స్, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. మిడిల్ క్లాస్ వాళ్లు చిన్న ప్లాట్లపై ఇంట్రస్ట్ చూపిస్తున్నారని, బడా బిల్డర్స్ పెద్ద ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారని అధికారులు తెలిపారు. దేశ పౌరులెవరైనా బిడ్డింగ్​లో పాల్గొనవచ్చని చెప్పారు. ఇప్పటివరకు రెండు దఫాలుగా ఉప్పల్ భగాయత్ ప్లాట్ల సేల్స్ జరిగాయని, ఈసారి కూడా ఆక్షన్ కు మంచి స్పందన వస్తుందన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో విజయవాడ, వరంగల్ హైవేలకు దగ్గరగా  733 ఎకరాల విస్తీర్ణంలో ఉప్పల్ భగాయత్ వెంచర్​ ఏర్పాటవుతోందని అధికారులు చెప్పారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆన్ లైన్ బిడ్డింగ్ లో ప్లాట్లను దక్కించుకున్న వాళ్లు 90 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే, ఆ తర్వాత పదిహేను రోజుల్లో హెచ్ఎండీఏ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తుందని వివరించారు. ప్లాట్ విలువలో 25 శాతం చెల్లిస్తే, మిగతా మొత్తానికి బ్యాంక్ లోన్ అవకాశం ఉందన్నారు. ఉప్పల్ భగాయత్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ బిల్డింగ్ పర్మిషన్లను హెచ్ఎండిఏ మాత్రమే ఇస్తుందని తెలిపారు.