ఆపరేటర్ ను కొట్టి చంపిన నిందితుల అరెస్ట్

ఆపరేటర్ ను కొట్టి చంపిన నిందితుల అరెస్ట్
  • 24 గంటల్లో హత్య కేసును 
  • ఛేదించిన చేవెళ్ల పోలీసులు
  • అభినందించిన  సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి

చేవెళ్ల, వెలుగు: ఆలూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ హత్య కేసును చేవెళ్ల పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నేపాల్ కు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం కేసు వివరాలను సీఐ లక్ష్మారెడ్డి, ఎస్ఐలు ప్రదీప్ కుమార్, బ్రహ్మం మీడియాకు తెలిపారు.

ఆలూర్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మాస్టర్ గా పనిచేసే నేపాల్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి వద్దకు అతని స్నేహితులు చినోద్ తప, రమేశ్ దమి, ఉమేశ్ భగవాన్నీ గత బుధవారం వచ్చారు. అదేరోజు రాత్రి విద్యుత్ సబ్ స్టేషన్ లో నిద్ర పోవడానికి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో ఆపరేటర్ కు చెప్పించారు. మరుసటి రోజు గురువారం కూడా మధ్యాహ్నం వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసి, రాత్రిపూట మద్యం తాగి మళ్లీ విద్యుత్ సబ్ స్టేషన్ నిద్రించేందుకు వెళ్లారు.

ఆపరేటర్ హర్యానాయక్ ఒప్పుకోకపోవడంతో తాగిన మత్తులో అతని తలపై నలుగురు కలిసి బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతుడి సెల్ ఫోన్ , సబ్ స్టేషన్ సెల్ ఫోన్ కూడా తీసుకొని పరారయ్యారు.  ఆపరేటర్ హత్య ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిన చేవెళ్ల పోలీసులను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.