క్యాన్సర్​తో పోరాడుతూనే జాబ్ తెచ్చుకుండు

క్యాన్సర్​తో పోరాడుతూనే జాబ్ తెచ్చుకుండు

చదువుకు తగ్గ ఉద్యోగం తెచ్చుకోవాలని కలలు కన్నాడు  అర్ష్​ నందన్ ప్రసాద్.  అందుకోసం చాలా జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ఇంటర్వ్యూలో అదరగొట్టినా ఉద్యోగం రాలేదు. కారణం... అతనికి క్యాన్సర్​ ఉండడమే. అందరూ  ‘నీకు క్యాన్సర్​ ఉంది కదా!’అని జాలిపడేవాళ్లే తప్ప, జాబ్ ఇచ్చేవాళ్లు కాదు. అయినా నిరుత్సాహపడలేదు. కీమోథెరపీ చేయించుకుంటూనే జాబ్ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. ఈమధ్య హాస్పిటల్ బెడ్ మీద, ల్యాప్​టాప్ ముందు కూర్చొని జాబ్ ఇంటర్వ్యూ ఇస్తున్న ఫొటోను లింక్​డిన్​లో పెట్టి, ‘నామీద జాలిపడడం కాదు. నా టాలెంట్​ని గుర్తించండి’ అన్నాడు నందన్. నందన్​ ఐటీ కోర్స్​ చేశాడు. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకున్నాడు.  కానీ, క్యాన్సర్​ ఆయన కలలకు అడ్డుపడింది. దాంతో, ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా నిరాశే మిగిలింది. అయినా కూడా,  జాబ్​ తెచ్చుకోవాలన్న తన సంకల్పాన్ని పక్కన పెట్టలేదు. ట్రీట్మెంట్​ చేయించుకుంటూ జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్లాడు.  హాస్పిటల్​లోనూ బెడ్ మీద కూర్చొని ఆన్​లైన్​లో జాబ్ ఇంటర్వ్యూలు అటెండ్​ అయ్యేవాడు.  

వారియర్​ అంటూ కామెంట్లు 

‘కొన్నిసార్లు ఇంటర్వ్యూ బాగా చేసినా కూడా జాబ్ రాదు. కారణం.. జీవితంలో  కష్టమైన పరిస్థితిలో ఉన్న మనల్ని చూసి ఉద్యోగమిచ్చే కంపెనీలు  జాలిపడడమే. నాకు  క్యాన్సర్​ ఉందని తెలిశాక,  వాళ్ల ముఖంలో నన్ను సెలక్ట్ చేయొద్దనే ఎక్స్​ప్రెషన్ కనిపించేది. నాకు మీ జాలి అవసరం లేదు. నా టాలెంట్​ని నిరూపించుకునేందుకే  జాబ్ ఇంటర్వ్యూకు అటెండ్ అవుతున్న ఈ ఫొటో పెట్టా”అన్నాడు నందన్. ఆ పోస్ట్ వైరల్ అయింది.  

జాబ్ ఆఫర్ వచ్చింది

సోషల్​మీడియాలో నందన్ పోస్ట్ చూసి చలించి పోయాడు మహారాష్ట్రకు చెందిన అప్లైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ ఫౌండర్ నీలేశ్​. అతనికి  జాబ్ ఆఫర్ ఇచ్చాడు. ‘‘ఓ వారియర్..​ ఇక జాబ్స్ కోసం ట్రై చేయడం ఆపేయ్. మంచి ట్రీట్మెంట్ తీసుకో. నీకు ఇంటర్వ్యూ లేదు. కోలుకోగానే వచ్చి ఉద్యోగంలో చేరు” అని చెప్పాడు నీలేశ్.