
- బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమిలో మరో రెండు పార్టీల చేరిక
న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, ప్రతిపక్ష మహా ఘట్బంధన్ సీట్ల పంపకం చర్చలు జోరందుకున్నాయి. 6 పార్టీలతో ఉన్న ఈ కూటమిలో తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి పరాస్ నేతృత్వంలోని ఎల్‌జేపీ వర్గం కొత్తగా చేరాయి. దీంతో 243 అసెంబ్లీ సీట్లను 8 పార్టీలు పంచుకోవాల్సి ఉంది. లాలూ ప్రసాద్‌యాదవ్ ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్, వీఐపీతో ఉన్న కూటమిలో ఈ కొత్త చేరికలు సంక్లిష్టతను పెంచాయి.
పశుపతి పరాస్ ద్వారా పాస్వాన్ పార్టీ ఓట్లను చీల్చేందుకు కూటమి ప్రయత్నిస్తున్నది. ఖగరియా, హాజీపూర్‌లో పరాస్, ఆయన కుమారుడు పోటీ చేసేందుకు రెండు నుంచి మూడు సీట్లు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది. జార్ఖండ్‌కు సరిహద్దు వెంట ఉన్న బంకా, ముంగేర్, భాగల్పూర్ ప్రాంతాల్లో జేఎంఎం పార్టీ సీట్లు కోరుతున్నది. ఈసారి ముఖేశ్ సాహ్ని నేతృత్వంలోని వికాస్ శీల్ఇన్సాన్పార్టీ (వీఐపీ) 50 సీట్లతోపాటు డిప్యూటీ సీఎం పదవి కోరుతున్నది. ఈబీసీ ఓట్ల కోసం ఆర్జేడీ వీఐపీని కూటమిలో ఉంచాలని చూస్తున్నది. కాంగ్రెస్ సీట్ల సంఖ్య 70 నుంచి 60కి తగ్గవచ్చని సమాచారం.