చినుకు పడితే మెట్రో జర్నీకే మొగ్గు : 3 రోజుల్లో 15 లక్షల మందికి పైగా మెట్రో ప్రయాణం

చినుకు పడితే మెట్రో జర్నీకే మొగ్గు : 3 రోజుల్లో 15 లక్షల మందికి పైగా మెట్రో ప్రయాణం

హైదరాబాద్, వెలుగు: చినుకు పడిందంటే చాలు సిటీ జనం మెట్రో జర్నీకే మొగ్గు చూపుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్​జామ్, సిగ్నళ్ల వద్ద వెయిటింగ్, వర్షంలో తడవడం కంటే మెట్రో ఎక్కితే ఫ్రీగా వెళ్లొచ్చని భావిస్తున్నారు. భారీ వర్షపాతం నమోదైన గత శని, ఆది, సోమవారాల్లో చాలా వరకు మెట్రో రైళ్లలోనే గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఆఫీసులకు వెళ్లి వచ్చేటప్పుడు, ఇతర పనుల కోసం అంతా మెట్రో రైళ్లను వినియోగించుకున్నారు. దీంతో ప్రధాన మెట్రో స్టేషన్లు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఆ మూడు రోజుల్లో యావరేజ్​గా 5 లక్షల మంది జర్నీ చేశారని మెట్రో వర్గాలు తెలిపాయి. 

శనివారం 5 లక్షలకు పైగా జర్నీ చేశారని, ఆది, సోమవారాలు హాలిడేస్ అయినప్పటికీ దాదాపు 5 లక్షలకు తగ్గలేదని వెల్లడించారు. గత నెల 20వ తేదీన భారీ వర్షం కురిసింది. ఆ ఒక్క రోజే మెట్రోలో 5.5 లక్షల మంది ప్రయాణించారు.ప్రస్తుతం మెట్రో అధికారులు ప్రతి 5 నిమిషాలకో ట్రైన్​నడుపుతున్నారు. రోజూ 56 రైళ్లు.. వెయ్యికి పైగా ట్రిప్పులు నడుస్తున్నాయి. 

అయితే పండుగలు, వర్షాల టైంలో రద్దీ విపరీతంగా ఉంటున్నా.. కోచ్​ల సంఖ్య పెంచడం లేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం మూడు బోగీలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. గతంలో నాగ్​పూర్​నుంచి అదనపు బోగీలు తీసుకొచ్చి నడుపుతామని చెప్పినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. మూడు నిమిషాలకో మెట్రో రైలు నడపాలనే డిమాండ్​ఉన్నా టెక్నికల్​రీజన్స్​వల్ల అది వీలు పడట్లేదని అధికారులు చెబుతున్నారు.