ట్యాంక్ బండ్ పై ఆర్టీసీ బస్సుల పరేడ్

ట్యాంక్ బండ్ పై ఆర్టీసీ బస్సుల పరేడ్

హైదరాబాద్, వెలుగు: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆర్టీసీ శనివారం ట్యాంక్ బండ్ పై బస్సులతో పరేడ్ నిర్వహించింది. అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు రాజధాని, గరుడ బస్సుల ర్యాలీ కొనసాగింది. 1932లో నిజాం పాలనలో నడిచిన అల్బియన్ బస్సును మరోసారి బయటకు తెచ్చి ఇప్పటి తరానికి ఆ వాహనం చరిత్రను పరిచయం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది ర్యాలీకి హాజరయ్యారు. ఆర్టీసీ సేవల్ని విస్తృతంగా వాడుకోవాలని సజ్జనార్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆర్టీసీ సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ వజ్రోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 9 నుంచి 21 వరకు 12 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. పంద్రాగస్టు నాడు పుట్టిన పిల్లలకు పన్నెండేళ్ల వయసు వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అవకాశాన్ని కల్పిస్తామని సర్క్యులర్ విడుదల చేసింది. 

రాఖీ పౌర్ణమి నాడు ఆర్టీసీకి 20 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రాఖీల పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీకి రూ.20 కోట్ల ఆదాయం లభించిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో 45 లక్షల మంది ప్యాసింజర్లను వారి గమ్యస్థానాలకు చేర్చామని శని  వారం ప్రకటనలో తెలిపారు. ఎంజీబీఎస్, జేబీఎస్ తోపాటు ఎల్బీనగర్, ఆరంఘర్​తో పాటు వివిధ పాయింట్ల నుంచి  అదనంగా 1,230 సర్వీసులను నడిపినట్లు వెల్లడించారు. భారీ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలిగి నందుకు చింతిస్తున్నామని తెలిపారు. బస్సుల్ని ఆదరించినందుకు బాజిరెడ్డితో పాటు సజ్జనార్ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.