ఏ ఒత్తిడి మమ్మల్ని ఆపలేదు.. కేరళ నర్స్‎ను ఉరి తీసే వరకు పోరాటం ఆపం: తలాల్ అబో మహది

ఏ ఒత్తిడి మమ్మల్ని ఆపలేదు.. కేరళ నర్స్‎ను ఉరి తీసే వరకు పోరాటం ఆపం: తలాల్ అబో మహది

న్యూఢిల్లీ: యెమెన్ పౌరుడిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. 2025, జూలై 16న అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను చివరి నిమిషంలో యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. భారత ప్రభుత్వం, యెమెన్ జైలు అధికారులు జరిపిన చర్చలతో చివర్లో ఉరి శిక్ష పోస్ట్‎పోన్ అయ్యింది. నిమిష ఉరిశిక్ష వాయిదా పడటంపై మృతుడు తలాల్ అబ్దో మహదీ సోదరుడు అబ్దేల్‌ఫత్తా మహదీ సీరియస్‎గా రియాక్ట్ అయ్యాడు.

 నిమిష ఉరిశిక్ష వాయిదా పడటాన్ని తీవ్రంగా ఖండించాడు అబ్దేల్‌ఫత్తా మహదీ. బ్లడ్ మనీ, భారత ప్రభుత్వంతో సహా వివిధ పార్టీల మధ్యవర్తిత్వ చర్చలను అతడు తిరస్కరించాడు. ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ఖిసాస్ (ప్రతీకారం) కోసం తాము ఎదురు చూస్తున్నామని, ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. నిమిషకు ఉరిశిక్ష అమలు జరిగే వరకు చట్టపరమైన చర్యలను కొనసాగిస్తామని కుండబద్దలు కొట్టాడు. 

చివరి నిమిషంలో నిమిషకు ఉరి శిక్ష వాయిదా పడటం మేం ఊహించలేదన్నాడు. ఉరి వాయిదా వేయించిన వారికి ఒక్కటే చెబుతున్నాం.. మేం ఏ విధమైన సయోధ్యకు ఒప్పుకోమని, నిమిషకు ఉరి శిక్ష పడాల్సిందేనని ఖరాకండింగా చెప్పాడు. ఎటువంటి వాయిదా, ఒత్తిడి మమ్మల్ని ఆపలేదని.. నా సోదరుడి రక్తాన్ని డబ్బుతో కొనలేమన్నాడు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నాడు. మృతుడి సోదరుడు అబ్దేల్‌ఫత్తా మహదీ బ్లడ్ మనీ విధానం, రాజీ ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో నిమిష విషయంలో ఏం జరగుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

కేసు ఏంటంటే..?

కేరళలోని పాలక్కడ్‎కు చెందిన నిమిషా ప్రియా 2008లో యెమన్ వెళ్లి అక్కడ నర్సుగా పని చేసింది. అనంతరం 2015లో సొంతంగా క్లినిక్‌ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే.. యెమన్ చట్ట ప్రకారం అక్కడ సొంతంగా క్లినిక్ ఓపెన్ చేయాలంటే యెమన్ జాతీయుడి భాగస్వామ్యం అవసరం. దీంతో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ప్రియా క్లినిక్ ప్రారంభించింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 

2016లో మహదీపై ప్రియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన మహదీ ప్రియాపై వేధింపులకు దిగాడు. అంతేకాకుండా ప్రియా పాస్ట్ పోర్టు తిరిగి ఇవ్వకుండా బెదిరించాడు. దీంతో మహదీ నుంచి ఎలాగైనా పాస్ట్ పోర్టు తిరిగి తీసుకోవాలని భావించిన ప్రియా మరో వ్యక్తికితో కలిసి మహదీకి మత్తు మందు ఇచ్చింది. మత్తు మందు ఓవర్ డోస్ కావడంతో మహదీ మరణించాడు. దీంతో ప్రియా, ఆమెకు సహయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. 

2018లో ఈ కేసులో ప్రియాను దోషిగా తేల్చి 2020లో మరణ శిక్ష విధించింది యెమన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్. ఈ క్రమంలో ప్రియా యెమన్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి కూడా ప్రియాకు ఉరి శిక్ష విధించడాన్ని ఆమోదించాడు. ఈ క్రమంలోనే 2025, జూలై 16న నిమిషను ఉరి తీసేందుకు యెమెన్ ప్రభుత్వం సిద్ధమైంది. కానీ చివరి నిమిషంలో ఉరి వాయిదా పడింది.