
హైదరాబాద్: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు జంకేలా చేస్తోంది. ఈ క్రమంలో ఏసీబీకి మరో అవినీతి అధికారి అడ్డంగా దొరికాడు. బుధవారం (జూలై 16) హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. లంచం తీసుకుంటూ ఈఎన్సీ కనకరత్నం ఏసీబీ వలకు చిక్కాడు.
డీఈ బదిలీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ మేరకు ఈఎన్సీ కనకరత్నంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా, పంచాయతీ రాజ్ శాఖలో ఈఎన్సీ హోదాలో కొన్ని రోజుల క్రితమే పదవి విరమణ చేశారు కనకరత్నం. ఏడాది పాటు కనకరత్నం పదవిని పొడగించింది ప్రభుత్వం.
కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్మాజీ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మురళీధర్‌రావును కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను మంగళవారం (జూలై 15) ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మురళీధర్‌రావుతో పాటు ఆయన బంధువుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. మురళీధర్ రావుగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. మురళీధర్ రావు ఆస్తుల విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటాయని అంచనా.