సంగారెడ్డి, వెలుగు : ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క ఫ్రీ బస్ తప్ప అన్ని హామీలు తుస్సుమన్నయ్, అది కూడా ఆడవారికి ఫ్రీ బస్సు పెట్టి మగవారికి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు’ అని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. 26 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, ఇంద్రేశం, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహిర్ మున్సిపాలిటీల్లో ఆదివారం రోడ్‌షోలు నిర్వహించి, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు, అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రజలను డబ్బుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన డబ్బులు తీసుకున్నా.. ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని, గ్రామాలు, -పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని గుర్తు చేశారు. రూ. 4 వేల పెన్షన్, ఆడపిల్ల పెండ్లికి తులం బంగారం ఇస్తానన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఆర్థికసాయం వంటి హామీలు కాగితాలకే పరిమితం అయ్యాయన్నారు. రెండేండ్ల తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్‌యాదవ్, ఆదర్శ్‌రెడ్డి, రాజనర్సు, మామిళ్ల రాజేందర్, కాసాల బుచ్చిరెడ్డి, సపాన్‌దవ్, మఠం భిక్షపతి, చింతా గోపాల్ పాల్గొన్నారు.
