Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. నివేదికలో కోహ్లీ పేరు ప్రస్తావన

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణం.. నివేదికలో కోహ్లీ పేరు ప్రస్తావన

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కారణమని కర్ణాటక ప్రభుత్వం తన నివేదికలో ఆరోపించింది. కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో భాగంగా పోలీసుల అనుమతి లేకుండా ఆర్సీబీ ప్రజలను ఆహ్వానించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలిపింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నివేదికను బహిర్గతం చేశారు. నివేదికను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరినప్పటికీ అలాంటి గోప్యతకు ఎటువంటి చట్టపరమైన కారణాలు లేవని కోర్టు పేర్కొంది.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. నివేదిక ప్రకారం.. ఆర్సీబీ జూన్ 4 ఉదయం 7:01 గంటలకు సోషల్ మీడియాలో ఉచిత ప్రవేశంతో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు జరిగే విజయోత్సవ పరేడ్‌లో పాల్గొనాలంటూ ఆహ్వానం పోస్ట్ చేసింది. ఉదయం 8:55 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక ఖాతాలో విరాట్ కోహ్లీ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోలో కోహ్లీ బెంగళూరు ప్రజలతో కలిసి ఐపీఎల్ విక్టరీని జరుపుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. 

ఆ తర్వాత ఆర్సీబీ 04.06.2024న మధ్యాహ్నం 3:14 గంటలకు మరో పోస్ట్ చేసింది. విధానసౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల వరకు విక్టరీ పరేడ్ జరుగుతుందని ప్రకటించింది. ఈ విజయ పరేడ్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయని పేర్కొంది. కోహ్లీ వీడియో కావడంతో ఈ పోస్ట్‌లను దాదాపు 44 లక్షల మంది వీక్షించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం వద్దకు తరలి వచ్చారు. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు స్టేడియం వద్ద గుమిగూడారు.

►ALSO READ | Pat Cummins: యాషెస్ కోసం టీమిండియాను తక్కువగా అంచనా వేస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్

35000 స్టేడియం సామర్థ్యం మాత్రమే ఉండడంతో గేట్ నంబర్లు 1, 2, 21 వద్ద అభిమానులు గేట్లను బద్దలు కొట్టడం వల్ల తొక్కిసలాట జరిగింది. స్టేడియం సమీపంలోని ఒక డ్రైన్‌పై ఉంచిన తాత్కాలిక స్లాబ్ జనం బరువుకు తాళలేక కూలిపోవడం కూడా ఈ ఘటనకు కారణమైందని నివేదిక తెలిపింది. పోలీసులు వెంటనే స్పందించి గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గాయపడినవారి ఆరోగ్య పరిస్థితిని విచారించడానికి ఆసుపత్రులను సందర్శించారు. ఈ ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించగా, బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు.