వాహనదారులకు బిగ్ అలర్ట్.. పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ నెంబర్ ప్లేట్ మస్ట్.. మార్చుకోకపోతే బండి సీజ్

వాహనదారులకు బిగ్ అలర్ట్.. పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’ నెంబర్ ప్లేట్ మస్ట్.. మార్చుకోకపోతే బండి సీజ్
  • పాత బండ్లకూ ‘హై సెక్యూరిటీ’
  • 2019కి ముందు రిజిస్ట్రేషన్​ వెహికల్స్​కు మస్ట్ 
  • హెచ్ఎస్ఆర్ఎన్​పీ లేజర్​ కోడ్​లో పూర్తి వివరాలు 
  • వచ్చే సెప్టెంబర్ ​30వ తేదీ వరకు తుది గడువు ఇచ్చిన ఆర్టీఏ 
  • ఆ తర్వాత బండి రోడ్డిక్కితే ఫైన్​ లేదా సీజ్​
  • కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టే చాన్స్

మంచిర్యాల, వెలుగు: “ మీ వెహికల్​కు హై సెక్యూరిటీ రిజిస్ర్టేషన్​ నంబర్ ప్లేట్​(హెచ్ఎస్ఆర్ఎన్​పీ) ఉందా?..  సాధారణ నంబర్ ​ప్లేట్ ​ఉన్నట్టయితే వచ్చే సెప్టెంబర్​30లోగా వెంటనే మార్చుకోండి.  లేదంటే అక్టోబర్ ​నుంచి బండి రోడ్డెక్కితే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటారు. భారీగా ఫైన్ ​వేయడంతో పాటు  వెహికల్​ను సీజ్ చేసే చాన్సుంది’’. ఎందుకంటే.. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని వెహికల్స్​కు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్​మస్ట్ చేస్తూ ట్రాన్స్​పోర్ట్​డిపార్ట్​మెంట్​ఇటీవలే ఆర్డర్స్ ​జారీ చేసింది.  

లేజర్ కోడ్‎ను ట్రాక్ చేసి.. 

2019 నుంచి హై సెక్యూరిటీ నంబర్​ప్లేట్ సిస్టమ్​అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కొన్న వెహికల్స్‎కు రిజిస్ర్టేషన్​ సమయంలోనే హెచ్​ఎస్​ఆర్​ఎన్​పీని అమర్చుతున్నారు. అంతకుముందు కొన్న వాహనాలు ఇప్పటికీ సాధారణ నంబర్​ప్లేట్లతోనే నడుస్తున్నాయి. యాక్సిడెంట్లు, చోరీ సమయాల్లో వెహికల్స్ వివరాలు తెలుసుకోవడం కష్టమవుతుంది. అదే హై సెక్యూరిటీ ప్లేట్​ఉంటే దానిపైన లేజర్‌ కోడ్‌ను ట్రాక్‌ చేసి వెహికల్స్  పూర్తి వివరాలను తెలుసుకునే చాన్స్ ఉంటుంది.  

కాలం చెల్లిన వాహనాల కట్టడి.. 

కాలపరిమితి ముగిసిన వాహనాలు రోడ్లపై తిరగకుండా రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా 15 ఏండ్లు పూర్తయిన వెహికల్స్​ను గుర్తించే ప్రక్రియను చేపట్టింది. అయితే గడువు ముగిసిన వెహికల్స్​ వేర్వేరు నంబర్​ప్లేట్లతో రోడ్లపై తిరుగుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. చాలా వెహికల్స్​కు సకాలంలో ఫిట్​నెస్​ టెస్టులు చేయించకుండానే రోడ్లపై తిప్పుతున్నారు. హై సెక్యూరిటీ ప్లేట్​ద్వారా అలాంటి వాహనాలను ఈజీగా గుర్తించి, అడ్డుకట్ట వేయడం ఈజీ అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

 మంచిర్యాల జిల్లాలో 2019 మార్చి 31 నాటికి రిజిస్ర్టేషన్​అయిన వాహనాలు 2,18,246 ఉన్నాయి. వీటిలో కాలపరిమితి ముగినవి మినహా మిగిలిన అన్నింటికీ కొత్త నంబర్​ప్లేట్లు బిగించుకోవాల్సిందే. ఇక హై సెక్యూరిటీ ప్లేట్​అమర్చుకున్న వాహనాలు 3,03,10 ఉన్నాయి. అయితే  కొంతమంది వీటిని తొలగించి సాధారణ నంబర్​ప్లేట్ ​అమర్చుకొని రోడ్లపై తిరుగుతున్నారు. 

చార్జీల వివరాలు 

  • టూ టైర్​     రూ.300-350
  •  త్రీ టైర్​    రూ.350-450 
  • కార్లు    రూ.50-700 
  • కమర్షియల్‌    రూ.600-800 

నంబర్​ ప్లేట్ మార్చుకోవడం ఈజీ 

ఓల్డ్​వెహికల్స్​కు కొత్తగా హై సెక్యూరిటీ ప్లేటు అమర్చుకోవడానికి వాహనదారులు నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. https://bookmyhsrnp.com వెబ్‌సైట్‌లో వెహికల్​నంబర్​, టైప్​, కంపెనీ, జిల్లా తదితర వివరాలు రిజిస్టర్​చేసుకోవాలి. ఆ తర్వాత నంబర్‌ ప్లేట్‌ షోరూం డీటెయిల్స్​వస్తాయి. అనంతరం సదరు షోరూంకు వెళ్లి హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ అమర్చుకుని ఫొటో తీసి వెబ్‌సైట్‌లో అప్​లోడ్​ చేయాలి.