
తెలుగు రాష్ట్రాల రైతులకు ఎరువుల తిప్పలు మరిన్ని రోజులు తప్పేలా లేవు. రెండు రాష్ట్రాలకు పెద్దఎత్తున యూరియా సరఫరా చేసే పెద్దపల్లి ఎరువుల ఫ్యాక్టరీ తాత్కాలికంగా మూసివేయడమే అందుకు కారణం. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ప్లాంట్ లో యూరియా ఉత్పత్తి కి ఆటంకం ఏర్పడింది. ప్లాంట్లో ఆమోనియా సప్లై అయ్యే ఎల్బో పైపులలో లీక్ ఏర్పడడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
పైపుల లీకేజీ సమస్యను ఫిక్స్ చేసేందుకు15 రోజుల పాటు ప్లాంట్ మూసివేసి మరమ్మతులు చేపట్టనున్నారు. దీని వల్ల సుమారుగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోనుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఈ ప్రభావం పడుతుంది.
ఇప్పటికే తెలంగాణకు నెలకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉండగా అందులో జులై నెలలో 30 వేల8 వందల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించారు. ఈ క్రమంలో తెలంగాణ రైతులకు యూరియా కష్టాలు కలగకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇప్పటికే డిమాండ్ చేశారు. ఈ విషయం పై కేంద్ర మంత్రిని కూడా కలిసి వినతిపత్రం అందించారు. యూరియా సరఫరాను మెరుగుపస్తామని కేంద్రం హామీ ఇచ్చారు.
ఇక నుంచైనా యూరియా సరఫరా మెరుగుపడుతుందని భావిస్తున్న తరుణంలో ఎరువుల కంపెనీ తాత్కాలికంగా మూసివేతకు గురవ్వటం రైతులను ఆందోళన కలిగించే అంశం.