- ఫిబ్రవరి 10 తర్వాత కార్పొరేషన్ల విభజన
- కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు
- విలీన ప్రాంతాల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ పరిధిని మొత్తం300 మున్సిపల్ వార్డులుగా డీలిమిటేషన్ చేసే ప్రక్రియ కొలిక్కి వచ్చినా, ఈ పరిధి మొత్తాన్ని ఎన్ని సర్కిళ్లు, ఎన్ని జోన్లుగా ఏర్పాటు చేయాలన్న విషయంపై కసరత్తు జరుగుతున్నది. ఇందుకు గాను జీహెచ్ఎంసీ కమిషనర్ అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో చర్చిస్తున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న ఆరు జోన్లను 12 జోన్లకుగా పెంచి, ప్రస్తుతమున్న 57 సర్కిళ్లను 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో కమిషనర్ స్టడీ చేయిస్తున్నట్టు తెలిసింది.
మఖ్యంగా ఒక జోన్ పరిధిలోకి అయిదు సర్కిళ్లు వచ్చేలా జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జోన్లను విభజిస్తున్నపుడు ఒక సర్కిల్ మొత్తం ఓకే జోన్ పరిధిలోకి వచ్చేలా, ఆ సర్కిల్ లోని మున్సిపల్ వార్డులు కూడా మొత్తం ఆ సర్కిల్ పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటూ జోన్లు, సర్కిళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. 60 సర్కిళ్లు 12 జోన్లుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనతో పాటు 10 జోన్లు 60 సర్కిళ్లుగా విభజించాలన్న మరో ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది. పరిపాలన సౌలభ్యం, పౌర సేవల నిర్వహణతో పాటు మున్సిపల్ వార్డు రెండు సర్కిళ్ల పరిధిలోకి రాకుండా, ఓకే సర్కిల్ రెండు జోన్ల పరిధిలోకి రాకుండా చూస్తున్నారు.
ఫిబ్రవరి 10 తర్వాత కార్పొరేషన్ల విభజన
కార్పొరేషన్ ను రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా చేస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే, ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పలువురు మంత్రులు ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలక మండలి కొనసాగుతుండటంతో ఇప్పుడు ముక్కలు చేయడం కుదరదని, పాలకమండలి గడువు ఫిబ్రవరి 10న ముగిసిన తర్వాతే సాధ్యమని కొందరు అధికారులు అంటున్నారు. దీంతో ఫిబ్రవరి 10వరకు ఒక్కటే కార్పొరేషన్ గా ఉంటుందని, ఆ తర్వాతే స్పెషల్ ఆఫీసర్ పాలనతో పాటు కార్పొరేషన్లని విభజించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
విలీన ప్రాంతాల అభివృద్ధిపై ఆదేశాలు
జీహెచ్‌ఎంసీలో విలీనమైన 27 లోకల్ బాడీలపై ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఆయా ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. రెండు రోజుల క్రితం ఇదే అంశంపై జోనల్ కమిషనర్లతో కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ మీటింగులో 27 విలీన మున్సిపాలిటీల ప్రస్తుత పరిస్థితిపై సుదీర్ఘంగా డిస్కస్చేశారు. నిధుల కేటాయింపు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీశారు. రోడ్లకు రిపేర్లు, అంతర్గత రోడ్ల అభివృద్ధి, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుతో పాటు శానిటేషన్ సమస్యలపై ఫోకస్ పెట్టాలని కమిషనర్అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే స్థానిక సర్కిల్ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫీల్డ్లెవెల్లో పర్యవేక్షణ పెంచాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జోనల్ కమిషనర్లను సూచించారు.
