- ఉమ్మడి నల్గొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్
- వార్షిక క్రైమ్ వివరాలను వెల్లడించిన ఎస్పీలు
- సైబర్ నేరాలు తగ్గినా.. పోయిన డబ్బు ఎక్కువే
నల్గొండ/యాదాద్రి, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది. మహిళలపై వేధింపులు పెరగగా సైబర్ క్రైమ్ బాధితులు పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు శరత్ చంద్ర పవార్, కె. నరసింహ జిల్లాలకు సంబంధించిన క్రైమ్ రేట్ ను విడుదల చేశారు. 2024తో పోలిస్తే 2025లో నల్గొండ జిల్లాలో నేరాలు 8,834 నుంచి 8,493కి తగ్గాయి. తీవ్రమైన నేరాలు 221 నుంచి169కి తగ్గాయి.
భారీగా దోచుకున్న సైబర్ నేరగాళ్లు
గతేడాది కంటే ఈ ఏడాది ఉమ్మడి నల్గొండ జిల్లాలో సైబర్ క్రైమ్ రేట్ తగ్గిన బాధితులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి నగదు పోగొట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 2024 లో 1155 ఫిర్యాదులు రాగా 185 కేసులు నమోదు చేశారు. వీటిలో రూ. 7.83 కోట్ల నగదు పోగొట్టుకోగా రూ. 39.04 లక్షల నగదును తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. 2025లో 1043 ఫిర్యాదులు అందుకోగా 207 కేసులు నమోదయ్యాయి.
దాదాపు రూ. 10.15 కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేయగా వీటిలో రూ.1.07 కోట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాలో 2024 లో 235 కేసులు నమోదవ్వగా.. రూ.16.31 కోట్ల నగదు పోగొట్టుకోగా రూ.1.25 లక్షలు రికవరీ చేశారు. 2025లో 255 కేసులు నమోదవ్వగా రూ.4.62 కోట్ల నగదు పోగొట్టుకోగా రూ.1.48కోట్లు రికవరీ చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యం..
ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాల ఎస్పీలు మొదటి ప్రాధాన్యత కల్పించారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది. సూర్యాపేట జిల్లాలో 2024లో మొత్తం 622 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 2025లో 563కి తగ్గింది. రోడ్డు ప్రమాదాల్లో 204 మంది మృతి చెందగా 607 మందికి గాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది 323 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 343 మంది మరణించగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 725 మందికి సల్ప గాయాలయ్యాయి. యాదాద్రి జిల్లాలో మొత్తంగా 500 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
వేధింపులు పెరిగాయ్..
జిల్లాలో మహిళలపై వేధింపులు ఈ ఏడాది రెట్టింపయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది 60 రేప్ కేసులు నమోదు కాగా 338 మహిళలపై వేధింపుల కేసులు నమోదయ్యాయి. 38 ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా 60 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. మహిళలకు సంబంధించి మొత్తం 489 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది 703 కేసులు నమోదు కాగా వాటిలో వరకట్న హత్యలు 02, 346 మహిళలపై వేధింపులు, మహిళా హత్యలు 11, అత్యాచార కేసులు 87 నమోదయ్యాయి.
తగ్గిన ప్రాపర్టీ రికవరీ
ఈ ఏడాదిలో దొంగతనాలు తగ్గినా.. ఎత్తుకెళ్లిన సొమ్ము ఎక్కువగా ఉంది. సూర్యాపేట జిల్లాలో 360 దొంగతనాలు జరిగి రూ. 4.03 కోట్లు దొంగలించగా రూ. 1.22 కోట్లు రికవరీ చేశారు. నల్గొండ జిల్లాలో 637 దొంగతనాలు జరిగి రూ. 5.28 కోట్లు దొంగలించగా రూ.3.33 కోట్లు రికవరీ చేశారు. యాదాద్రి జిల్లాలో 335 దొంగతనాలు జరిగి రూ. 5.40 కోట్లు దొంగిలించుకొని పోగా రూ.కోటి మాత్రమే రికవరీ చేయగలిగారు.
కేసుల్లో శిక్షలు
నల్గొండ జిల్లాలో 132 కేసుల్లో శిక్షలు పడే విధంగా సాక్ష్యాలు సమర్పించారు. వీటిలో ఇద్దరికీ ఉరిశిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు ఇచ్చారు. 11 మందికి లైఫ్, 14 మందికి 14 ఏండ్లకు పైగా శిక్ష వేయగా, 8 మందికి 7 సంవత్సరాల కారాగార శిక్ష, 24 మందికి 7 సంవత్సరాలు, 71 మందికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పులు ఇచ్చింది. సూర్యాపేట జిల్లాలో 9 మందికి లైఫ్, ముగ్గురికి 15 సంవత్సరాలు, ఇద్దరికీ 5 ఏండ్లు, ముగ్గురికి 3 ఏండ్లు, 13 మందికి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. యాదాద్రి జిల్లాలో 346 కేసుల్లో శిక్షలు పడే విధంగా పోలీసులు సాక్షాలు సమర్పించారు. ఈ ఏడాదిలో 5774 కేసులు నమోదు అయ్యాయి. అయితే వచ్చిన 13,400 పిటీషన్లలో 12వేలకు పైగా డిస్పోజ్ చేశారు.
యాదాద్రిలో పెరిగిన సైబర్ క్రైమ్..
యాదాద్రి జిల్లాలో సైబర్ నేరాలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అత్యాచారాలు.. పోక్సో కేసులు తగ్గాయి. హత్యలు, రోడ్డు ప్రమాదాలు కొంత తగ్గాయి. గంజాయి సహా మత్తు పదార్థాల రవాణా పెరగడంతో కేసులు పెరిగాయి. గతంతో పోలిస్తే యాదాద్రి జిల్లాలో సైబర్ క్రైమ్ పెరిగిపోతోంది. 2022లో కేవలం 13 కేసులు నమోదు కాగా 2023లో 52 కేసులు, గతేడాదిలో 125 కేసులు, ఈ ఏడాదిలో 128 కేసులు నమోదయ్యాయి.
ఈసారి గంజాయి రవాణాలో 46 కేసులు నమోదు కాగా 69 మందిని అరెస్ట్ చేశారు. యాదాద్రిలో ఫోక్సో కేసులు, అత్యాచారాలు తగ్గాయి. 2024లో పోక్సో కేసులు 55 నమోదు కాగా ఈ ఏడాది 52 కేసులు నమోదయ్యాయి. 2024లో 42 మందిపై అత్యాచారాలు జరగగా ఈ ఏడాదిలో 36 నమోదయ్యాయి. మహిళలపై కుటుంబ హింస సహా వివిధ రూపాల్లో 316 కేసులు నమోదు అయ్యాయి. 2024లో 12 హత్యలు జరగగా, ఈసారి 8కి తగ్గిపోయింది. ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోయి 170 కేసులు నమోదు అయ్యాయి.
