- 1.12 కి.మీ బ్రిడ్జి నిర్మాణానికి రూ.203కోట్లు మంజూరు
- రెండు జిల్లాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని మండలం మానేరుపై ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.12 కిలో మీటర్ల హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ బ్రిడ్జితోపాటు అవతలివైపు భూపాలపల్లి జిల్లా దామరకుంట వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.203 కోట్లు మంజూరు చేసింది. దీంతో రెండు వైపులా మానేరు పరివాహక గ్రామాల మధ్య కనెక్టివిటీ పెరగనుంది. అలాగే త్రివేణి సంగమంతో ముడిపడి ఉన్న కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి టూరిజం పెరిగే చాన్స్ ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరగనుంది.
పెరగనున్న కనెక్టివిటీ
మంథని వైపు ఉన్న మానేరు పరివాహక గ్రామాల ప్రజలు మహారాష్ట్ర, కాళేశ్వరం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వెళ్లాలంటే మానేరు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఈ బ్రిడ్జి పూర్తయితే మంథని నుంచి కాళేశ్వరం వెళ్లేందుకు 25 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. దీంతో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. మహారాష్ట్రతోపాటు కాళేశ్వరం భూపాలపల్లి, కాటారం వెళ్లేందుకు ట్రాన్స్‌పోర్ట్ ఈజీ కానుంది.
ఆరెంద, మల్లారం, వెంకటాపూర్, దామెరకుంట గ్రామాల ప్రజలకు రవాణా, వైద్య, విద్యపరంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే మంథని నియోజవర్గంలోని రామగిరి, ముత్తారం కేంద్రాలుగా గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో ఉంది. అలాగే రామగుండం నుంచి మణుగూరు వరకు రైల్వే కారిడార్ నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో రానున్న రోజుల్లో పెద్దపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారుతుంది.
