మహిళలకు రక్షణ కల్పించడంలో సర్కారు ఫెయిల్ : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు  

మహిళలకు రక్షణ కల్పించడంలో సర్కారు ఫెయిల్ : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు  
  • మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా  రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని కత్రియా హోటల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.

కార్యక్రమానికి రాంచందర్ రావు చీఫ్ గెస్ట్​గా హాజరై, మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నారీ శక్తి అనేది ఒక జాతీయ మిషన్‌లా సాగుతోందన్నారు. బేటీ బచావో -బేటీ పఢావో సమాజంలో విప్లవాత్మక మార్పు తెచ్చిందని, ఉజ్వల యోజనతో పేద మహిళల వంటగదుల్లో పొగ పోయి, వెలుగులు వచ్చాయని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం వాటా కల్పించిన ఘనత మోదీదేనని ప్రశంసించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఊసేలేదని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న హామీని అటకెక్కించారని విమర్శించారు. సుపరిపాలన కోసం మహిళలు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు.

మహిళా నేతృత్వంలోని అభివృద్ధి వైపు..

 ఢిల్లీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ మాట్లాడుతూ... మోదీ నాయకత్వంలో భారత్ మహిళా అభివృద్ధి నుంచి మహిళా నేతృత్వంలోని అభివృద్ధి వైపు సాగుతోందన్నారు. మూడు కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా మార్చడమే లక్ష్యమని, డ్రోన్ టెక్నాలజీతో మహిళలు వ్యవసాయ రంగంలోనూ దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలు బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి రంగంలో మహిళలు నాయకత్వ స్థానాల్లోకి రావాలన్నారు.

రాష్ట్రంలో మహిళల భద్రత గాలికొదిలేసిన సర్కార్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ... ముద్ర రుణాల్లో 70 శాతం మహిళలకే అందుతున్నాయని, ఇది వారి ఆర్థిక స్వయంప్రతిపత్తికి నిదర్శనమన్నారు. మహిళల హక్కుల కోసం, కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ మహిళా మోర్చా రాజీలేని పోరాటం చేస్తోందనితెలిపారు. బీజేపీ నేతలు తూళ్ల వీరేందర్ గౌడ్, జయశ్రీ, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.