- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతయ్
- బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లు దాటుతది
దోహా: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం వల్ల గల్ఫ్ ప్రాంతంలోని చమురు, సహజ వాయువు ఎగుమతిదారులు అందరూ మరికొద్ది రోజుల్లోనే ఉత్పత్తిని నిలిపివేసే అవకాశం ఉందని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ హెచ్చరించారు. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలు వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు వల్ల గల్ఫ్ దేశాల నుంచి ఇంధన ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.
యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అల్-కాబీ పేర్కొన్నారు. సప్లై చైన్ తెగిపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని.. ఇది ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచి, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని హెచ్చరించారు. కాబీ హెచ్చరికల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర శుక్రవారం 4.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 89.17 డాలర్లకు చేరుకుంది.
ఒకవేళ హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతే, రాబోయే రెండు మూడు వారాల్లో చమురు ధర 150 డాలర్ల మార్కును దాటవచ్చని ఆయన అంచనా వేశారు. కాగా, నెలకు 3,000 నౌకలు ప్రయాణించే హార్మూజ్ జలసంధి మార్గంలో యుద్ధం కారణంగా ప్రస్తుతం సుమారు 200 ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ దిగ్బంధం వల్ల చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా, జపాన్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడనుంది.
ఖతార్ ప్లాంట్‌పై దాడి.. ఉత్పత్తి నిలిపివేత
ఖతార్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి వల్ల ప్లాంట్ పనితీరుకు ఆటంకం కలిగింది. తమ ఇంధన కేంద్రాలపై జరిగిన సైనిక దాడుల కారణంగా 'లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ)’ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఖతార్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది.
యుద్ధం ఇప్పుడే ముగిసినా, తిరిగి సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాల నుంచి నెలల సమయం పడుతుందని ఆ సంస్థ సీఈఓ కూడా అయిన కాబీ స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా వచ్చే కొద్ది రోజుల్లోనే ఉత్పత్తిని నిలిపివేస్తాయని ఆయన పేర్కొన్నారు.
