న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తా..మీడియాతో ఉన్నావ్ రేప్ బాధితురాలు

న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తా..మీడియాతో ఉన్నావ్  రేప్ బాధితురాలు
  • ప్రధాని మోదీని కూడా కలిసి ఈ అన్యాయాన్ని వివరిస్తా
  • నా గోడు విని రాహుల్, సోనియా కంటతడి పెట్టారని వెల్లడి
  • కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన విక్టిమ్

న్యూఢిల్లీ: తనపై అత్యాచారానికి పాల్పడిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్​కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తమను షాకింగ్​కు గురి చేసిందని ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయం ఈ దేశ కూతుళ్ల మనోధైర్యాన్ని బలహీనం చేసిందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో 2017లో గ్యాంగ్ రేప్​కు గురైన బాధితురాలు (సంఘటన సమయంలో మైనర్) బుధవారం తన తల్లితో కలిసి లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. సెంగార్​కు బెయిల్​ను వ్యతిరేకిస్తూ ఇండియాగేట్ వద్ద నిరసన చేపట్టిన బాధితురాలు, ఆమె తల్లిని పోలీసులు బలవంతంగా తరలించడంపై రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఖండించారు. 

ఈ నేపథ్యంలో పోలీసులు వదిలిపెట్టిన తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి10 జన్ పథ్ రోడ్డులోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. తమకు జరిగిన అన్యాయం గురించి రాహుల్, సోనియాకు చెప్పుకున్నారు.  అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే రాహుల్, సోనియా కంటతడి పెట్టారని చెప్పారు. 

న్యాయం కోసం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలవడంతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. తమ కేసును వాదించేందుకు అడ్వకేట్ కావాలని రాహుల్​ను కోరామన్నారు.  ‘‘మాకు న్యాయం జరిగేలా చూస్తామని రాహుల్, సోనియా హామీ ఇచ్చారు. మాకు పూర్తి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు” అని వెల్లడించారు.

విక్టిమ్​కు బెదిరింపులా?: రాహుల్

‘‘గ్యాంగ్ రేప్ బాధితురాలిపట్ల ఇలా ప్రవర్తిస్తారా? రేపిస్టులకు బెయిల్ ఇస్తూ, బాధితులను క్రిమినల్స్ మాదిరిగా చూస్తరా? ఇదేం న్యాయం? మన దేశం కేవలం డెడ్ ఎకానమీగా మాత్రమే కాదు.. ఇలాంటి అమానవీయ ఘటనలతో డెడ్ సొసైటీగా మారుతోంది” అని లోక్​ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఆయన ఈ మేరకు ‘ఎక్స్’లో స్పందించారు.