విద్యాశాఖలో పది కొత్త స్కీములు! బడ్జెట్లో భారీగా ప్రతిపాదనలు

విద్యాశాఖలో పది కొత్త స్కీములు! బడ్జెట్లో భారీగా ప్రతిపాదనలు
  • యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.9 వేల కోట్లు! 
  • బ్రేక్ ఫాస్ట్ స్కీముకు వెయ్యి కోట్లు.. వెల్ కమ్ కిట్లకు 250 కోట్లు 
  • ఇంటర్ లో మిడ్డే మీల్స్, బ్రేక్ ఫాస్ట్ స్కీముకు 170 కోట్లు!
  • స్కూటీలు, స్కాలర్ షిప్ ల కోసం 1,500 కోట్లు..
  • పాలిటెక్నిక్ అప్​గ్రేడేషన్ కోసం 2,500 కోట్లు 
  • గతేడాది బడ్జెట్ రూ.23 వేల కోట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ కు దీటుగా మార్చేందుకు విద్యాశాఖ ప్రణాళికలు రెడీ చేసింది. విద్యాశాఖలో ఏకంగా పది కొత్త స్కీములు వచ్చే అవకాశముందని అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే, గతేడాది రూ. 23 వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా, మరో 10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల అదనంగా నిధులు కావాలని ప్రతిపానదలు రెడీ చేసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ.9వేల కోట్ల ప్రపోజల్స్ రెడీ చేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున దీన్ని నిర్మించాలని సర్కారు నిర్ణయించగా, ఒక్కో స్కూల్​ కు రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. దీనికి బడ్జెట్​లో నిధులు పెట్టనున్నారు. 

అందరికీ బ్రేక్ ఫాస్ట్.. ఇంటర్ లో మిడ్డే మీల్స్ 

పిల్లల హాజరు పెంచేందుకు, పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్ ఫాస్ట్  స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను అమలు చేయబోతున్నారు. ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకున్న 18వేల మంది విద్యార్థుల కోసం రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదనలు రెడీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కారు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 200 కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా. ఇంటర్ విద్యలో నాణ్యత పెంచేందుకు జిల్లాకు ఒక కాలేజీ చొప్పున కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీగా మార్చనున్నారు. ఇందుకోసం రూ. 66 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పెట్టారు. అలాగే స్కాలర్ షిప్ ల కోసం మరో రూ. 1,500 కోట్లు ప్రతిపాదించారు. 

వెల్ కమ్ కిట్లకు నిధులు..

సర్కారు బడిలో చేరే చిన్నారులను ప్రోత్సహించేందుకు వెల్ కమ్ కిట్ పేరుతో కొత్త స్కీము అమలు చేయనున్నారు. 2 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, షూ, సాక్స్ ల కోసం రూ. 250 కోట్లతో పాటు, ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో చేరే చిన్నారులకు ప్రత్యేకంగా బ్యాగ్, కలర్ పెన్సిల్స్, స్లేట్ వంటి వాటి కోసం రూ.15 కోట్లు ప్రతిపాదిస్తున్నారు. దీంతో హైస్కూల్ విద్యార్థులకు వర్క్ బుక్స్ పంపిణీకి రూ. 50 కోట్లు ప్రపోజల్ రెడీ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ స్టూడెంట్లకు ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ డ్రెస్, వింటర్ జాకెట్లు, శానిటరీ ప్యాడ్ల కోసం రూ. 50 కోట్లు ప్రతిపాదించారు. ఇంటర్, డిగ్రీ చదివే అర్హులైన విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేయడంతో పాటు, డిగ్రీ కాలేజీల్లో కొత్త భవనాల నిర్మాణానికి ప్రపోజల్స్ రెడీ చేశారు. యూనివర్సిటీల అభివృద్ధికి కూడా గ్రాంట్లు పెంచే అవకాశం ఉంది. 

మారనున్న పాలిటెక్నిక్ ల రూపురేఖలు

పాలిటెక్నిక్ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 పాలిటెక్నిక్ కాలేజీల అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ కోసం విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. స్టూడెంట్లకు అత్యాధునిక టెక్నాలజీపై ట్రైనింగ్​ ఇచ్చేందుకు కొత్త మెషీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాలేజీల ఆధునీకరణ, ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఏర్పాటు కోసం రూ. 2,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.