1,052 గ్రామాల్లో ‘ఎస్ హెచ్ జీ’ భవనాలు.. ఒక్కో బిల్డింగ్ నిర్మాణానికి రూ.10 లక్షలు : మంత్రి సీత‌‌‌‌క్క

1,052 గ్రామాల్లో ‘ఎస్ హెచ్ జీ’ భవనాలు.. ఒక్కో బిల్డింగ్ నిర్మాణానికి రూ.10 లక్షలు : మంత్రి సీత‌‌‌‌క్క
  •     ఉపాధి హామీ పథకం నుంచి నిధులు 
  •     200 గజాల్లో కనీసం 552 చ.అడుగుల్లో నిర్మించేలా డిజైన్ 
  •     గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల‌‌‌‌ను గుర్తించాలని మంత్రి సీత‌‌‌‌క్క ఆదేశాలు  

హైద‌‌‌‌రాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్​హెచ్​జీలు), గ్రామైక్య సంఘాల(వీవోలు) బలోపేతానికి మరో ముందడుగు పడింది. సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి, కార్యకలాపాలు సాగించడానికి శాశ్వత వేదికగా నిలిచే పక్కా భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ భవనాల నిర్మాణం కోసం గ్రామాల్లో ప్రభుత్వ స్థలాల‌‌‌‌ను గుర్తించాలని ఈ మేరకు అధికారులను మంత్రి సీత‌‌‌‌క్క ఆదేశించారు. 

ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ డైరెక్టర్ సృజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా1,052 గ్రామాల్లో ఎస్ హెచ్ జీ ఫెడరేషన్లు, వీవోల కోసం బిల్డింగ్స్ నిర్మించనున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని, వీవోలు, ఎస్ హెచ్ జీ ఫెడరేషన్ల కోసం శాశ్వత భవనాలు నిర్మించాలని మ‌‌‌‌హిళా సంఘాల సభ్యులు ప్రభుత్వానికి ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేప‌‌‌‌థ్యంలో ప్రభుత్వం ఈ భవన నిర్మాణాలకు ముందుకొచ్చింది. 

ఒక్కో భవనానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు వ్యయం చేయనున్నారు. 200 గ‌‌‌‌జాల జాగాలో క‌‌‌‌నీసం 552 చ‌‌‌‌ద‌‌‌‌ర‌‌‌‌పు అడుగుల్లో భ‌‌‌‌వ‌‌‌‌నం ఉండేలా డిజైన్ రెడీ చేశారు. భవనంలోకి గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, తలుపులు(డీ2) ప్లాన్ చేశారు. రోడ్డుకు ఆనుకుని ఉండేలా ఈ ప్లాన్ ను రూపొందించారు. భవనంలో కేవలం గోడలే కాకుండా ఎలక్ట్రికల్ సదుపాయాలకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధాన ప్రొవిజన్స్ కింద ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణ పనులకు సంబంధించి ప్లాన్, ఎస్టిమేషన్లను పరిశీలించిన ఈజీఎస్ జేసీ ఆమోదముద్ర వేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. 

కాగా, ఉపాధి హామీ నిధుల‌‌‌‌తో చేప‌‌‌‌ట్టే ఈ పనులకు సామాజిక తనిఖీ తప్పనిసరిగా నిర్వహించనున్నారు. భ‌‌‌‌వ‌‌‌‌న నిర్మాణ పనులు పూర్తయిన ఆరు నెలలలోపు సోషల్ ఆడిట్ పూర్తి చేయాల‌‌‌‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ద‌‌‌‌శ‌‌‌‌ల వారీగా అన్ని గ్రామాల్లో ఎస్​హెచ్​జీ ఫెడరేషన్ భవనాలు నిర్మించ‌‌‌‌నున్నారు. గ్రామసభ తీర్మానం ద్వారా ప్రతిపాదనలు పంపితే, కలెక్టర్ అనుమతితో పనులు చేపట్టనున్నారు. నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో పూర్తిచేస్తారు.  

ప్రతి గ్రామంలో ‘ఎస్ హెచ్ జీ’ బిల్డింగ్  

గ్రామీణ మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా, స్వయం ఉపాధి, నిర్ణయాధికార కేంద్రాలుగా ఎదగాలి. అందుకే ప్రతి గ్రామంలో ఎస్​హెచ్​జీ ఫెడరేషన్ భవనం నిర్మిస్తున్నాం. మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఈ మార్గదర్శకాలను కలెక్టర్లు, పీఆర్ ఆర్డీ అధికారులు కచ్చితంగా అమలు చేయాలి. మహిళా సంఘాల బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలి.
‌‌ - మంత్రి సీతక్క