రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సగటున 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సాధారణంగా నమోదు కావాల్సిన కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మరింత తక్కువగా నమోదవుతున్న కారణంగా రాష్ట్రంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 6 నుంచి 11 వరకు హైదరాబాద్ లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొంటాయని సూచించింది. టెంపరేచర్ 8 నుంచి 14 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్ మరింత పడిపోయి, 5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
దీంతోపాటు రాష్ట్ర మంతటా అక్కడక్కడ వర్షాలు కురవొచ్చని సూచింది. హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి నుంచి అక్కడక్కడ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్లెడ్, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట, తార్నాక, హబ్సిగూడ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసాయి.

