V6 News

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో..11.40 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో..11.40 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఇతర రాష్ట్రాలనుంచి రైళ్లలో  నిషేధిత డ్రగ్స్ తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీల్లో కోట్ల విలువైన నిషేధిత క్రిస్టల్ మెత్ డ్రగ్స్ ను పట్టుకున్నారు. పోలీసుల కళ్లు గప్పి బ్లాక్ కవర్స్, బెడ్ షీట్లలో దాచి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

మంగళవారం(ఏప్రిల్ 28)  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో డీఆర్ ఐ అధికారులు చేసిన తనిఖీల్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు.  ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఇద్దరు మహిళ దగ్గర  11.40 కిలోల క్రిస్టల్ మెత్ (Amphetamine) డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ కవర్లలో డిజైనర్ పేపర్ తో కప్పి, బెడ్ షీట్ మడతల్లో దాచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. పట్టుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ రూ.11.40 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు.

డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు.. ఇద్దరు మహిళలపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రగ్ ట్రాఫికింగ్‌ను అరికట్టేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు చెప్పారు.