
- రిజిజు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిలా మాట్లాడాలి: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, వెలుగు: దేశంలో మైనారిటీలు పౌరులుగా కాకుండా బందీలుగా బతుకుతున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మైనారిటీలకు మెజారిటీ వర్గాల కంటే ఎక్కువ ప్రయోజనాలు, రక్షణ లభిస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రిజిజు వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని, ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్షను విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్‌లో ఒవైసీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. "మైనారిటీలు భారతదేశంలో రెండో తరగతి పౌరులుగా కూడా లేరు. మేము బందీలం" అని పేర్కొన్నారు.
"ప్రతిరోజూ పాకిస్తానీ, బంగ్లాదేశీ, జిహాదీ అని పిలవడం ప్రయోజనమా? మూకదాడుల్లో ప్రాణాలు కోల్పోవడం రక్షణా? మా ఇండ్లు, మసీదులను బుల్డోజర్లతో కూల్చివేయడం హక్కా? ప్రధానమంత్రి నుంచి విద్వేష ప్రసంగాలు ఎదుర్కోవడం గౌరవమా?" అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. రిజిజు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిలా మాట్లాడాలని, చక్రవర్తిలా కాదని ఒవైసీ సూచించారు. "మైనారిటీల హక్కులు ప్రాథమిక హక్కులు, అవి ఎవరి దయాదాక్షిణ్యం కాదు" అని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని విమర్శిస్తూ, హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు సభ్యులుగా ఉండలేరని.. కానీ, వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులు సభ్యులుగా చేరేలా చట్టం రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లిం విద్యార్థులపై ప్రభుత్వ విధానాలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల రద్దును ప్రస్తావిస్తూ.. ఉన్నత విద్యలో ముస్లింల సంఖ్య గణనీయంగా తగ్గిందని, తరతరాల అభివృద్ధి తిరోగమనంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. "మేము మెజారిటీల కంటే ఎక్కువ ఏమీ కోరడం లేదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమే కోరుతున్నాం" అని ఒవైసీ స్పష్టం చేశారు.