ఢిల్లీకి చేరిన రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ

ఢిల్లీకి చేరిన రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ

రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. సోమవారం (మే 29న) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి రానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీకానుండడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సచిన్ పైలట్ పై ఏం ఫిర్యాదు చేయనున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొంతకాలంగా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విబేధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో అశోక్ గెహ్లాట్ భేటీకానున్నారు. ఆ తర్వాత విడిగా సచిన్ పైలట్ కూడా సమావేశం కానున్నారని తెలుస్తోంది. 

తాను చేసిన మూడు ప్రధానమైన డిమాండ్లను ఈనెలాఖరులోపు (మే 31) పరిష్కరించకుంటే రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించిన సచిల్ పైలెట్.. అశోక్ గెహ్లాట్ సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. 

గత బీజేపీ ప్రభుత్వ హయంలో (వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో) జరిగిన అవినీతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని పైలెట్ డిమాండ్ చేస్తున్నారు. 

ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. రాజస్థాన్ కాంగ్రెస్ లో నాయకుల మధ్య విబేధాలను పరిష్కరించాలని అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించింది. రాష్ట్ర  కాంగ్రెస్ నేతలందరినీ ఒకే వేదికపై తీసుకురావాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 

కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఖర్గే విజయం సాధించారని... ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అదే ఫార్ములాను ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని సీనియర్ నేత ఒకరు చెప్పారు.