అంతర్జాతీయ డ్యాన్స్ పోటీల్లో అశ్వారావుపేట అమ్మాయి

అంతర్జాతీయ డ్యాన్స్ పోటీల్లో అశ్వారావుపేట అమ్మాయి

కాలేజీ పీజు కోసం చిన్నపాటి ప్రోగ్రామ్స్ లో డ్యాన్స్ చేసిన ఆ విద్యార్థినికి ఇప్పుడు అంతర్జాతీయ డ్యాన్స్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది ఆ యువతి. అంతర్జాతీయ పోటీల్లోనూ గెలిచి దేశానికి పేరు తీసుకొస్తాను అంటోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రమీల. అశ్వారావుపేట నియోజకవర్గంలోని గురవాయిగూడేనికి చెందిన తామ ప్రమీల డ్యాన్సులో రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఆదివాసీ కుటుంబంలో పుట్టిన ప్రమీలకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచింది. ఐదో తరగతి నుంచి డ్యాన్స్ చేసేది ప్రమీల. సత్తుపల్లికి చెందిన గణేశ్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటూ కాలేజీ ఫీజులు  కట్టేందుకు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో పాల్గొనేది. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన ప్రమీల.. తల్లికి సహాయంగా ఉంటూ ఖాళీ సమయంలో డ్యాన్స్  ప్రాక్టీస్ చేస్తోంది. ఇటీవల రంగస్థలం టీవీ షో లోనూ పాల్గొంది. ఏలూరులో ఫైన్ ఆర్ట్స్ సంస్థ నిర్వహించిన పోటీల్లోనూ పాల్గొని ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఇప్పుడు సింగపూర్ లో జరిగే అంతర్జాతీయ డ్యాన్స్ పోటీలకు ఎంపికైంది. అయితే సింగపూర్ కు వెళ్లే ఆర్థిక స్థోమత తనకు లేదంటోంది ప్రమీల. ప్రభుత్వం  సాయం చేస్తే పోటీల్లో గెలిచి దేశానికి పేరు తెస్తానంటోంది. సింగపూర్ లో జరిగే అంతర్జాతీయ పోటీలకు ప్రమీల ఎంపిక కావడం తమ ఊరికి గర్వకారణమంటున్నారు స్థానికులు. ఈ తరం పిల్లలకు ఆమె ఆదర్శమని చెబుతున్నారు. పట్టుదల ఉంటేఏదైనా ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది ఈ ఆదివాసీ విద్యార్థిని.