మంత్రులే రెచ్చగొడుతున్నరు

మంత్రులే రెచ్చగొడుతున్నరు

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల ఆవేదన
రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్య
హక్కుల కోసం సమ్మె చేస్తుంటే.. తక్కువ చేసి మాట్లాడుతున్నరు
తెలంగాణ ఉద్యమంలో ఈ మంత్రులు ఎక్కడున్నరని ప్రశ్న
ద్రోహులా మా గురించి మాట్లాడేది? అని ఫైర్
ఉద్యమంలో మాతో పనిచేసిన టీఆర్ఎస్నేతలు ఎటుపోయారు?
హరీశ్‌, ఈటల ఎందుకు మాట్లాడటం లేదని మండిపాటు
దయచేసి కార్మికులను రెచ్చగొట్టొద్దు: అశ్వత్థామరెడ్డి

అప్పుడు సీమాంధ్ర పాలకుల కింద, పార్టీల్లో ఉన్న నేతలు ఇప్పుడు సమ్మెపై మాట్లాడటాన్ని తప్పుబడుతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నేతలు.. టీఆర్ఎస్​లో చేరి ఇప్పుడు మంత్రి పదవులు దక్కించుకుని ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. 48 వేల మంది ఉద్యోగాలు పోయాయని పదే పదే ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తుంటే.. ఇదేంటని ప్రశ్నించకుండా తమ సమ్మెను తప్పుబట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తుంటే రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నాయని, తమను పార్టీలే వెనుకుండి నడిపిస్తున్నాయని మాట్లాడటం సరికాదని అంటున్నారు.

సీఎం, మంత్రుల వల్లే శ్రీనివాస్‌‌రెడ్డి ఆత్మహత్య

సీఎం, మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్లే డ్రైవర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. ‘‘డ్రైవర్‌‌ శ్రీనివాస్‌‌రెడ్డి ఆత్మహత్యకు కార్మిక నాయకులే కారణం. ఓ నేతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతోనే కార్మికులను రెచ్చగొడుతున్నారు” అంటూ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో తమతో కలిసి పనిచేసిన టీఆర్‌‌ఎస్‌‌ నేతలంతా ఎటుపోయారని ప్రశ్నిస్తున్నారు. అన్ని అంశాలపై స్పందించే కేటీఆర్‌‌.. 48 వేల మంది కార్మికుల గోసపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీస్తున్నారు. ఎవరు ఏం చేసినా తాము సమ్మెను కొనసాగిస్తామని తేల్చిచెప్తున్నారు.

ఉద్యమ ద్రోహులా మా గురించి మాట్లాడేది

‘‘తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని మంత్రులు పువ్వాడ అజయ్‌‌, ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌, గంగుల కమలాకర్‌‌తో ప్రభుత్వం ఎందుకు మాట్లాడిస్తోంది. ఇయ్యాల ఉద్యమ ద్రోహులు మా గురించి మట్లాడుతున్నరు. ఉద్యమకాలంలో సీమాంధ్ర పాలకుల తొత్తులుగా ఉండి.. స్టూడెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడి.. అప్పుడు వాళ్ల ఆత్మహత్యలకు కారకులయ్యారు. వీళ్లా మాపై మాట్లాడేది. ఉద్యమంలో మాతో కలిసి పనిచేసిన ఈటల రాజేందర్‌‌, హరీశ్‌‌రావు, జగదీశ్‌‌రెడ్డి, నిరంజన్‌‌రెడ్డి, కేటీఆర్‌‌ ఎటు పోయిండ్రు? ఎక్కడ ఉన్నరు? వాళ్లు ఎందుకు మాట్లాడరు? ఉద్యమ ద్రోహులు మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? దయచేసి కార్మికులను రెచ్చగొట్టవద్దు’’

– ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌‌ అశ్వత్థామరెడ్డి