పోక్సో కేసులో 35 ఏండ్ల జైలు శిక్ష... ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు

పోక్సో కేసులో 35 ఏండ్ల జైలు శిక్ష... ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు

ఆసిఫాబాద్, వెలుగు : బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడికి 35 ఏండ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ నితికాపంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ కు చెందిన పదహారేండ్ల బాలిక నిజామాబాద్ లోని కాలేజీలో చదువుతుండగా.. అదే ఏరియాలోని కంఠేశ్వర్ కాలనీకి చెందిన సాయి చరణ్ రెడ్డి(25), ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధించేవాడు. 2013, ఏప్రిల్ లో ఆసిఫాబాద్ లో బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు.  ఆపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడికి యత్నించాడు. 

బాలిక తండ్రి ఫిర్యాదు తో ఆసిఫాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐ సాదిక్ పాషా పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. కాగ జ్ నగర్ డీఎస్పీలు షేక్ సలీమా, సురేష్ బాబు ఎంక్వైరీ చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.శ్రీనివాస్ వాదనలు వినిపించగా, లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్ సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. వీటిని పరిశీలించి నిందితుడు సాయి చరణ్ రెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా వ్యవహిరించిన ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, ఆసిఫాబాద్ టౌన్ సీఐ బాలాజీ వరప్రసాద్, సిబ్బందిని ఎస్పీ నితికా పంత్ అభినందించారు.

కరీంనగర్ జిల్లాలో..

కరీంనగర్ క్రైమ్ : బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్  పోక్సో కోర్టు జడ్జి శ్రీనివాస్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. కరీంనగర్ సిటీలో అద్దెకు ఉండే కుటుంబానికి చెందిన పన్నెండేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉండే లారీ డ్రైవర్‌‌ మడుపు నరసింహచారి(35) మాయమాటలు చెప్పి నమ్మించాడు. బాలికపై నరసింహచారి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తీరుపై అనుమానం వచ్చిన తల్లి విచారించింది. 

పెండ్లి చేసుకుంటానని నరసింహచారి నమ్మించి లైంగికదాడికి పాల్పడినట్టు, ఎవరికి చెప్పొద్దని బెదిరించినట్టు  తెలిపింది. దీంతో 2022లో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నరసింహచారిపై కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించి నరసింహాచారికి జడ్జి   జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.