- ఆ దేశ మొదటి సీడీఎఫ్‌గా బాధ్యతలు
- ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కూ ఆయనే బాస్
- 2030 వరకు పదవిలో.. రాజ్యాంగ సవరణ ద్వారా సీడీఎఫ్ పదవి సృష్టి
- ఐదేండ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కూ ఆయనే బాస్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ త్రివిధ దళాలకు అధిపతి అయ్యారు. పాక్ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (సీడీఎఫ్) గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇకపై ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ కూ ఆయనే చీఫ్‌గా వ్యవహరించనున్నారు. త్రివిధ దళాల అధిపతిగా ఆసిఫ్ ఐదేండ్ల వరకు కొనసాగుతారు. పాక్ రాజ్యాంగంలో వివాదాస్పద 27వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా సీడీఎఫ్ పదవిని సృష్టించారు. ఈ నెల 1న ఈ రాజ్యాంగ సవరణల ప్రతిపాదనను సెనేట్ పాస్ చేసింది.
దీంతో చైర్మన్ ఆఫ్ ద జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీజేసీఎస్ సీ) పదవి రద్దయింది. 1971లో భారత్ తో జరిగిన యుద్ధంలో పాక్ ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత 1976లో నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో సీజేసీఎస్ సీ పదవిని సృష్టించారు. ప్రస్తుత సీజేసీఎస్ సీ జనరల్ సాహిర్ షంషాద్ మిర్జా పదవీకాలం ముగియడంతో గురువారం ఆయన రిటైర్ అయ్యారు. కాగా.. సీడీఎఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆసిమ్ మునీర్ 2030 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకూ త్రివిధ దళాలపై అధ్యక్షుడే పూర్తి ఆధిపత్యం చలాయించారు. తాజాగా ఆ అధికారాన్ని అధ్యక్షుడి నుంచి సీడీఎఫ్ కు బదిలీ చేశారు. దీంతో పాక్ అధ్యక్షుడికి ఉన్న న్యాయపరమైన రక్షణ సీడీఎఫ్కూ ఉంటుంది. సీడీఎఫ్ పదవిలో ఉన్నంత కాలం ఆసిమ్ మునీర్‌పై ఎలాంటి విచారణ చేయడానికి వీల్లేదు. సీడీఎఫ్తో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్‌లకూ ఈ రక్షణలు ఏర్పాటు చేశారు.
