మణిపూర్ పోలీసులను కాపాడిన అస్సాం రైఫిల్స్

మణిపూర్ పోలీసులను కాపాడిన అస్సాం రైఫిల్స్

ఇంఫాల్ : సాయుధ మిలిటెంట్ల ఉచ్చులో చిక్కుకున్న మణిపూర్ పోలీసు టీమ్ ను అస్సాం రైఫిల్స్ దళాలు కాపాడాయి. కొండపై నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా డేరింగ్ ఆపరేషన్ చేపట్టి పోలీసులను రక్షించాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ అక్టోబరు 31న జరగగా..ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  మోరే ఏరియాలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చింగ్తం ఆనంద్ కుమార్‌‌ను ఇటీవల మిలిటెంట్లు కాల్చి చంపారు. దాంతో అధికారులు మోరే ప్రాంతానికి అదనపు బలగాన్ని కేటాయించారు. 

ఈ క్రమంలోనే అక్టోబరు 31న మణిపూర్ పోలీస్ కమాండోల కాన్వయ్ మోరేకు బయలుదేరగా..వారిపై మిలిటెంట్లు హఠాత్తుగా కాల్పులు జరిపారు. తెంగ్నౌపాల్ జిల్లాలోని ఇంఫాల్~-మోరే హైవే-102 వెంబడి సినామ్ వద్ద కొండల్లో దాక్కున్న  మిలిటెంట్లు పోలీసు బృందంపై బుల్లెట్ల వర్షం కురిపించాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న అస్సాం రైఫిల్స్ కమాండోల బృందం మిలిటెంట్ల దాడిని గుర్తించింది. వెంటనే ఘటనాస్థాలానికి చేరుకుని తమ ప్రాణాలను లెక్కచేయకుండా..  పోలీసులను తమ వెహికల్ లో ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడగా.. వారిని అస్సాం రైఫిల్స్ కమాండోలు ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.