అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది

అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది
  • టెర్రర్​ దాడులకు మేం దీటుగా బదులిస్తున్నం: మోదీ
  • మత రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు 
  • జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పీఎం

పలాము(జార్ఖండ్)/ దర్భంగా(బిహార్): దేశ భద్రతపై గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు పిరికితనంతో వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. గతంలో టెర్రరిస్ట్ దాడులు జరిగినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై ఏడ్చేదని, కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో పరిస్థితి మారిపోయిందన్నారు. ఇప్పుడు తమను కాపాడాలంటూ పాకిస్తాన్ ఏడుస్తోందన్నారు.

‘‘అప్పట్లో యూపీఏ సర్కారు శాంతిని కోరుతూ పాకిస్తాన్ కు లవ్ లెటర్లు రాసేది. కానీ పక్క దేశం మాత్రం వాటికి బదులుగా మరింత మంది టెర్రరిస్టులను పంపేది. నేడు ఇండియా విజ్ఞప్తులు చేయడంలేదు. ఇది న్యూ ఇండియా. శత్రువుల ఇంట్లోకి దూరి ఎలా చంపేసి రావాలో దీనికి తెలుసు. సర్జికల్ స్ట్రైక్స్ తో వణికిపోయిన పాకిస్తానీ లీడర్లు ఇప్పుడు షహజాదా(రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.

కానీ స్ట్రాంగ్ గవర్నమెంట్, స్ట్రాంగ్ పీఎం కావాలని స్ట్రాంగ్ ఇండియా కోరుకుంటోంది” అని ప్రధాని అన్నారు. శనివారం జార్ఖండ్​లోని పలాము, బిహార్​లోని దర్భంగాలో జరిగిన బీజేపీ లోక్ సభ ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. జార్ఖండ్​లో అవినీతిలో కూరుకుపోయిన సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్ నేతలు తమ పిల్లల కోసం భారీగా ధనం పోగేస్తున్నారని ఆరోపించారు. ‘‘నాకు సొంత ఇల్లు లేదు. కనీసం సైకిల్ కూడా లేదు. సీఎం, పీఎంగా 25 ఏండ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా ఒక్క అవినీతి మరక కూడా లేదు” అని చెప్పారు.  

కాంగ్రెస్ తీరు నెహ్రూకు వ్యతిరేకం 

ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని మార్చాలని కాంగ్రెస్ చూస్తోందని మోదీ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, ఇండియా కూటమి మీ భూములను లాక్కోవాలని చూస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాలను లాక్కుని, ముస్లింలకు రిజర్వేషన్లు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. నేను ప్రాణాలతో ఉన్నంతవరకూ దీనిని జరగనివ్వబోను” అని మోదీ చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్, నెహ్రూ కూడా వ్యతిరేకించారని.. ఇండియా కూటమి వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా పని చేస్తోందన్నారు. 

గోధ్రా దోషులకు లాలూ అండ 

గుజరాత్​లోని గోధ్రాలో 2002లో రైలు దహనం ఘటనలో 60 మంది కరసేవకుల సజీవదహనానికి కారణమైనవారిని కాపాడేందుకు అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారని మోదీ ఆరోపించారు. దోషులకు అనుకూలంగా రైల్వే శాఖ ద్వారా లాలూ ఎంక్వైరీ కమిటీ నివేదికను ఇప్పిస్తే.. దానిని కోర్టు విసిరిపారేసిందన్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ యువరాజు ఉంటే.. పాట్నాలోనూ మరో యువరాజు ఉన్నారంటూ తేజస్వీ యాదవ్​ను ఉద్దేశించి మోదీ కామెంట్ చేశారు. వారిద్దరూ ఈ దేశం తమ జాగీరుగా భావిస్తున్నారని విమర్శించారు. తేజస్వీ యాదవ్ అగ్నిపథ్ స్కీం విషయంలోనూ ముస్లింల ప్రస్తావన తెస్తున్నారని తప్పుపట్టారు. కెప్టెన్ హమీద్ వీరమరణం పొందితే.. ఎవరైనా ఆయనను ఒక ముస్లిం అని  ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు.

వచ్చే ఐదేండ్లలో అవినీతిపరులపై చర్యలు 

దేశంలోని అవినీతి శక్తుల ముసుగును ఎన్డీఏ సర్కారు తొలగించిందని, వాళ్లపై వచ్చే ఐదేండ్లలో చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఇండియా కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారని మోదీ మండిపడ్డారు.