
హైదరాబాద్, వెలుగు: వరంగల్– నల్గొండ– ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇస్తున్నామని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారని, ప్రజల తరపున గొంతెత్తారని శనివారం ఓ ప్రకటనలో వారు పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పాలకుల తప్పిదాలను ప్రజలకు వివరించారని, పాలకులను ఎప్పటికప్పుడు నిలదీశారని చెప్పారు. అలాంటి యువ నాయకుడు శాసన మండలిలో ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్ణయించామని వారు పేర్కొన్నారు.