
హైదరాబాద్, వెలుగు: జొన్నల కొనుగోళ్ల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఎకరానికి 8.85 క్వింటాళ్లు కొనుగోలు చేసేలా గతంలో పరిమితులు ఉండగా.. ఈసారి డిమాండ్ పెరగడంతో ఆ పరిమితిని పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో జొన్నల కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 12 క్వింటాళ్లకు పెంచామని వ్యవసాయ శాఖ వెల్లడించింది. కొనుగోలు ఏజెన్సీ మార్క్ఫెడ్ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రైతులెవరూ తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని సూచించింది. పెరిగిన దిగుబడికి అనుగుణంగా పరిమితిని పెంచి రైతుల నుంచి క్వింటాల్కు రూ.3,180 మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేసింది.